నిజమే ఓ సినీ రచయిత అన్నట్లు.. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ ఉండరేమో! ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా బిడ్డను లోకంలోకి తీసుకొస్తుంది అమ్మ. వారిని చూడగానే ప్రసవ వేదనను మరిచి.. సంతోషంలో మునిగి తేలుతుంది. ఏ పని చేసినా.. తన బిడ్డే అందరి కంటే ఉత్తమం అనుకుంటుంది. జీవితంలో కచ్చితంగా ఏదో సాధిస్తాడని నమ్ముతుంది. వారి బంగారు భవిష్యత్ కోసం నిరంతరం శ్రమిస్తుంది.
ఒడిలో పసికందుతో మెట్రోరైలు ఎక్కిందా మహిళ. అప్పటికే సీట్లన్నీ నిండిపోయాయి. అక్కడ కూర్చున్న వారిలో యువతులు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. చేతుల్లో శిశువుతో ఉన్న ఆ అమ్మను.. చూసి చూడనట్టుగా ఉండిపోయారు. కదిలే రైలులో పసిబిడ్డతో ఆ అమ్మ ఎక్కువ సేపు నిలబడలేకపోయింది. కింద కూర్చుని.. ఒళ్లో బిడ్డను ఉంచుకుని గమ్యం వరకూ ప్రయాణించింది. హైదరాబాద్ మెట్రోలో జరిగిన సంఘటనను ఎవరో వీడియోతీసి ‘గ్రేట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ హైదరాబాద్’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
సామాజిక విలువలు ఏమయ్యాయి..?
గర్భిణులు.. చంటిపిల్లలతో ఉన్న మహిళలు కనిపించగానే కూర్చున్న సీటును ఇవ్వటం సాధారణంగా చూస్తుంటాం. మెట్రోరైలులో అక్కడ ఉన్న ఏ ఒక్కరూ స్పందించకపోవటం.. బాలింత అనే కనికరం చూపకపోవటంపై నెటిజన్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంత పెద్దచదువులు పూర్తిచేసిన మహిళలు.. కనీస మానవత్వం చూపకపోవటం దారుణమంటున్నారు. మెట్రోరైలులో జరిగిన ఘటనపై హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి స్పందించారు. ఇది బాధాకరం. తోటి ప్రయాణికులు సీటిచ్చి సహకరించాల్సి ఉంది. అలా చేయకపోవటం బాధగా అనిపించింది. మనం కట్టుబడి ఉన్న సామాజిక విలువలను ప్రశ్నించేదిగా ఉంది.