ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు తనిఖీ జరపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును (KRMB) జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) ఆదేశించింది. కేఆర్ఎంబీ నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయని తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం, గవినోళ్ల శ్రీనివాస్ వేసిన ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం విచారణ జరిపింది.
మేమే వివరిస్తాం
పిటిషన్లపై కేఆర్ఎంబీ, ఏపీ ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేశాయి. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శనకు ఏపీ సహకరించడం లేదని అఫిడవిట్లో కృష్ణా బోర్డు పేర్కొంది. దానిపై వివరణ ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రాజెక్టు సందర్శనకు ఎవరినీ పంపించాల్సిన అవసరం లేదన్న ఏపీ.. తామే అక్కడి పరిస్థితులను వివరిస్తూ సమాధానం ఇస్తామని చెప్పింది. డీపీఆర్ తయారీ, పర్యావరణశాఖ, కేంద్ర జలసంఘం అడిగిన అంశాలపై మాత్రమే అధ్యయనం, చేస్తున్నామని వివరించింది.
ఎన్జీటీ సందర్శించాలి: తెలంగాణ