తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో.. నగర, పురపాలికల్లో కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు

ఏపీ.. నగర, పురపాలికల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. పలు చోట్ల సమగ్ర కసరత్తు తర్వాత మంత్రులు.. మేయర్లు, ఛైర్‌పర్సన్ల పేర్లను ప్రకటించారు. మరికొన్ని చోట్ల వివిధ వర్గాల మధ్య పోటీతో సందిగ్ధత కొనసాగుతోంది.

new-governing-bodies-to-be-found-in-the-city-and-municipalities
ఏపీలో.. నగర, పురపాలికల్లో కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు

By

Published : Mar 18, 2021, 8:06 AM IST

ఏపీలో నేడు నగరాలు, పట్టణాల పాలకవర్గాలకు ప్రమాణ స్వీకారం జరగనుంది. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి పేరును మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ప్రకటించారు. మచిలీపట్నం మేయర్‌గా వెంకటేశ్వరమ్మ పేరును ఖరారు చేశారు. కృష్ణా జిల్లా తిరువూరు పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌గా కస్తూరిబాయి, వైస్ ఛైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెండేళ్ల తర్వాత వేరే వారికి అవకాశం ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.

గుంటూరు నగరపాలక మేయర్‌, ఇతర మున్సిపాల్టీల ఛైర్మన్ల ఎన్నికకు రంగం సిద్ధమైంది. మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఛైర్ పర్సన్‌గా నాగేంద్రమణి, వైస్‌ ఛైర్మన్‌గా వెంకటేశ్‌ పేర్లను మంత్రి విశ్వరూప్ ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం, నిడదవోలు మున్సిపాలిటీలకు ఛైర్ పర్సన్ల ఎంపిక ఇవాళ నిర్వహించనున్నారు. అన్ని స్థానాల్లోనూ పేర్లు దాదాపు ఖరారు కాగా.. ఒక్క జంగారెడ్డిగూడెం విషయంలో పలు వర్గాలు పోటీ పడుతున్నాయి.

కడప నగరపాలక సంస్థ మేయర్‌గా సురేశ్ బాబు పేరు ఖరారైంది. డిప్యూటీ మేయర్ల పేర్లు వెల్లడి కావాల్సి ఉంది. తెలుగుదేశం అత్యధిక వార్డులు గెలుచుకున్న మైదుకూరు మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌లోని పుట్టా సుధాకర్​యాదవ్ ఇంట్లో ఉన్న తెదేపా కౌన్సిలర్లు.. మైదుకూరు చేరుకుని ఓటింగ్‌లో పాల్గొననున్నారు. కర్నూలు నగరపాలక సంస్థ మేయర్‌గా బీవై రామయ్య ఎన్నిక లాంఛనం కానుంది. నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీ విషయంలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.

ప్రకాశం జిల్లా ఒంగోలు మేయర్‌గా జి. సుజాతను ఎంపిక చేశారు. మార్కాపురం, చీరాల మున్సిపాలిటీలు, గిద్దలూరు, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి నగర పంచాయతీల్లో పేర్లు వెల్లడి కావాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు పురపాలికల్లో ఛైర్‌ పర్సన్లుగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. తిరుపతి మేయర్‌ అభ్యర్థిగా డాక్టర్‌ శిరీష, చిత్తూరు మేయర్‌గా అముదను వైకాపా ప్రకటించింది. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు పురపాలక ఛైర్మన్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. అనంతపురం నగరపాలక సంస్థ సహా జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మంత్రి బొత్స ఇప్పటికే పూర్తి చేశారు. అనంతపురం మేయర్‌గా వసీంకు అవకాశం దక్కింది. ఉత్కంఠ రేపుతున్న తాడిపత్రిలో సంఖ్యాబలం బట్టి ఎన్నిక ఉంటుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

విశాఖ మహా నగరపాలక సంస్థ కార్యాలయం 9ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కళకళలాడనుంది. ఇక్కడ గొలగాని హరివెంకట కుమారి మేయర్‌ కానున్నారు. మేయర్ ఎన్నిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వినయ్​చంద్ పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ పురపాలికలతో పాటు పాలకొండ నగర పంచాయతీకి సంబంధించి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. విజయనగరం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కార్యక్రమం నిర్వాహణకు ఏర్పాట్లు చేశారు. విజయలక్ష్మి లేదా కృష్ణవేణి మేయర్‌ అయ్యే అవకాశం ఉంది. సాలూరు పాలకవర్గానికి సంబంధించి ఈశ్వరమ్మ, జరజా దీప్తి పేర్లను ఎమ్మెల్యే రాజన్నదొర ప్రకటించారు.

ఇదీ చదవండీ:ముందంజలో కొనసాగుతున్న తెరాస అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details