కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ప్రజలు అంటరానివారిగా చూస్తున్నారు. మృతదేహాన్ని బంధువులు కూడా తీసుకువెళ్లటానికి నిరాకరిస్తున్నారు. ఖననం చేయడానికి గ్రామ, పట్టణ ప్రజలు అంగీకరించడంలేదు. కరోనా బాధితులంటే కనీస మానవత్వం చూపించని పరిస్థితుల్లో... ముస్లిం యువకులు మేము ఉన్నామంటూ ముందుకు వచ్చారు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో కరోనాతో మృతి చెందిన పలువురి మృతదేహాలను తీసుకువెళ్లి... శ్రద్దతో ఖననం చేస్తున్నారు. పది గ్రూపులుగా ఏర్పడి ముస్లిం సోదరులు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందిస్తున్నారు.
సేవా కార్యక్రమాలకు కులమత బేధం లేదు. మనసు ఉంటే చాలు అని నిరూపిస్తున్నారు... నెల్లూరు జిల్లాకు చెందిన ముస్లిం సోదరులు. వీరంతా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థలో పనిచేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఈ యువకులు చేస్తున్న సేవ పలువురిని కదిలిస్తోంది. అంతేకాకుండా లాక్డౌన్ సమయంలో పాజిటివ్ వచ్చిన బాధితుల ఇళ్లకు వెళ్లి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
నెల్లూరు జిల్లాకు చెందిన వంద మంది యువకులు పది గ్రూపులుగా ఏర్పడ్డారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ అనుమతి తీసుకున్నారు. డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మీ ఆధ్వర్యంలో కరోనా మృతదేహాలను ఈ యువకులు స్వయంగా వచ్చి అంబులెన్స్ లో తీసుకువెళ్లి ఖననం చేస్తున్నారు.