ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే శ్రీశైలం జల విద్యుత్ ప్రమాదం జరిగిందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించడంతోపాటు 500 గజాల స్థలం ఇవ్వాలన్నారు.
ఆ ప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదు : రేవంత్ రెడ్డి
శ్రీశైలం ప్రమాద ఘటనలో మృతి చెందిన డీఈ శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని ఎంపీ రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ పరామర్శించారు. హైదరాబాద్ చంపాపేట్‌లోని డీఈ నివాసానికి వెళ్లి వారితో మాట్లాడారు. జరిగిన దుర్ఘటనలో మరణించడం చాలా విషాదకరం, బాధాకరమన్నారు.
హైదరాబాద్ చంపాపేటలోని శ్రీశైలం విద్యుత్ ఘటనలో మృతి చెందిన డీఈ శ్రీనివాస్ గౌడ్‌నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వానికి చెందిన 10 వేల కోట్ల రూపాయల ఆస్తిని, ఉద్యోగుల ప్రాణాలను రక్షించారని రేవంత్ అన్నారు. అలాంటి సమర్థవంతమైన ఉద్యోగిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని బాధితుల కుటుంబాన్ని సీఎం కేసీఆర్, మంత్రి పరామర్శించకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. ఈ ఘటనపై పార్లమెంట్‌లో ప్రస్తావించే విధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.
ఇదీ చూడండి :'రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది'