కరోనా రోజురోజుకూ వేగంగా ప్రబలిస్తుంటే... నన్ను మర్చిపోయారా అంటూ దోమలు దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. వానాకాలంలో ఈ సూక్ష్మ శత్రువులు తీవ్రస్థాయిలో విజృంభిస్తాయి. అప్రమత్తంగా ఉంటే రుగ్మతలను దీటుగా ఎదుర్కోవచ్చు. మాస్కులు ధరించి వ్యక్తిగత దూరం పాటిస్తూ కరోనా నుంచి రక్షించుకోవచ్చు. అలాగే ఇంటి పరిసరాల్లో దోమల ఉత్పత్తిని నిరోధించే ప్రక్రియలతో దోమకాటు నుంచి తప్పించుకోవచ్చు. అధికారులు చేపట్టే యాంటీ లార్వా ఆపరేషన్లు, దోమల మందు పిచికారీ, ఫాగింగ్‌పై ఆధారపడకుండా ఎవరికివారు చిన్నపాటి జాగ్రత్తలతో డెంగీ, మలేరియా, గన్యా, మెదడువాపు, బోద వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు.
కట్టడికి మార్గాలు..
- వేపనూనెతో..వేప, కొబ్బరి నూనెను సమాన నిష్పత్తిలో కలిపి చర్మంపై రాసుకుంటే దాదాపు 8 గంటలు దోమలు చర్మంపై వాలవని నిపుణులు చెబుతున్నారు. యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ప్రోటోజోల్ గుణాలు వేపనూనెలో ఉంటాయి. ఆ మిశ్రమాన్ని నిల్వ నీటిలోనూ చల్లొచ్చు. ఉపరితలంపై పలుచని పొర ఏర్పడి లార్వా చనిపోతుంది. వీటి స్థానంలో పనికిరాని నూనెలనూ చుక్కలుగా చల్లొచ్చని అధికారులు చెబుతున్నారు.
- పిచ్చి మొక్కలొద్దు..మొక్కల కుండీల్లో నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతాయి. పెరట్లో ఔషధ గుణాలున్న తులసి, పుదీనా, సిట్రోనెల్లా గ్రాస్, లెమన్ గ్రాస్ వంటి మొక్కలను పెంచితే దోమల నియంత్రణ సాధ్యమవుతుంది.
- దోమ తెరలు..అపార్ట్‌మెంట్ల సంస్కృతి మొదలయ్యాక దోమతెరల వినియోగం పట్టణాల్లో తగ్గింది. గ్రామాల్లో ఇప్పటికీ వినియోగంలో ఉంది. దోమ కాటును అవి నియంత్రిస్తాయి.
- తలుపులు తెరవొద్దు..చీకటి పడ్డాక తలుపులు తెరవకుండా ఉంటే దోమలు ఇంట్లోకి రావు. తలుపులు, కిటికీలకు మెష్‌లు అమర్చుకోవాలి.
- ఇంకుడు గుంతలు..వర్షాకాలానికి ముందు లోతట్టు ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. వాటి ద్వారా వరదనీటిని భూగర్భంలోకి పంపిస్తే నీటి నిల్వకు ఆస్కారం ఉండదు.
- తాగునీటి ట్యాంకులను తరచుగా క్లోరినేషన్ చేస్తుండాలి. చెరువులు, కాలువలు, మడుగుల్లో గంబూసియా చేపలను వదలాలి.
- పైపులైను లీకేజీలను అరికట్టాలి.