జీహెచ్‌ఎంసీ ప్రాంతాల్లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. కొత్త కొత్త ప్రాంతాలకు కూడా వైరస్ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం ఒక్కరోజే 214 కేసులు నమోదు కావడం గమనార్హం.
గాంధీ భవన్లో కరోనా కలకలం
బంజారాహిల్స్ పీఎస్‌లో ఓ ఎస్సైతో పాటు ఓ మహిళా కానిస్టేబుల్‌కి కరోనా నిర్ధరణ అయింది. కోఠి ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్‌కి కరోనా సోకింది. ఆయన ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి కరోనా సోకగా... నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
80 శాతం కేసులు ఇక్కడే...
లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో కరోనా మహమ్మారి భాగ్యనగర పరిధిలో భారీగా విస్తరిస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 80 శాతం కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. దీనివల్ల గ్రేటర్ పరిధిలో పది రోజుల్లోనే దాదాపు 50వేల పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకించారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్ జోన్లలో శాంపిల్స్ సేకరణ కొనసాగింది.