కారెక్కుతున్న కాంగ్రెస్ నేతలు శాసనసభ్యుల కోటా మండలి ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పోలింగ్ దగ్గర పడుతున్నా కొద్దీ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 5స్థానాలు తెరాసకే దక్కనున్నాయి. మొదట్లోనే ఇద్దరు స్వతంత్రులు తెరాసకు జై కొట్టారు. తాజాగా కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆత్రం సక్కు, రేగా కాంతారావు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు. ఇటీవల తెదేపా సభ్యులు కూడా ముఖ్యమంత్రిని కలవడం చర్చానీయాంశమైంది. ఎన్నికల్లో తెరాస 88 స్థానాలు గెలుచుకొని విజయఢంకా మోగించింది. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర సభ్యులు, నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి గులాబీ బలం 91కి చేరింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో అది కాస్తా 93కు చేరుతుంది. తెదేపా సభ్యులు కూడా చేరతారని ప్రచారం జరుగుతుండగా... సాగర్ ఎడమ కాల్వనీటిని విడుదల చేయాలంటూ సండ్ర, గిరిజన సమస్యల పరిష్కారం కోసం మెచ్చా నాగేశ్వర రావు కేసీఆర్ను కలసి ఊహాగానాలకు ఊతమిచ్చారు.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గెలవాలంటే ఇరవై మంది సభ్యుల మద్ధతు కావాల్సి ఉంటుంది. ఎంఐఎంతో కలిసి 5స్థానాలు కైవసం చేసుకునేందుకు తెరాస అభ్యర్థులను ప్రకటించింది. తెదేపా అండతో 19మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ఒక స్థానం గెలువొచ్చని గూడూరు నారాయణ రెడ్డిని బరిలో దించింది. కానీ... ఆత్రం సక్కు, రేగా కాంతారావుకు తెరాస కండువా కప్పి గూడూరును పోటీ నుంచి తప్పుకునేలా చేయాలనేది గులాబీ ఎత్తుగడగా తెలుస్తోంది.