గాజులరామారం పెద్దమ్మనగర్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేత వివాదంపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పందించారు. వీఆర్వోతో ఫోన్ సంభాషణ వైరల్‌గా మారిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. విద్యుత్ మీటర్లు తీసుకెళ్లడం, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం, దుర్భాషలు ఆడిన మూలంగానే వీఆర్వో శ్యామ్‌తో మాట్లాడానని తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున స్థానిక రెవెన్యూ సిబ్బంది బందోబస్తుతో వచ్చి పెద్దమ్మనగర్ సర్వే నెంబర్79లో పలు ఇళ్లు కూల్చివేశారని ఎమ్మెల్యే తెలిపారు. బాధితులంతా తనకు వారి కష్టాన్ని చెప్పుకున్నారని.. అందువల్లనే వీఆర్వోను హెచ్చరించానని తెలిపారు.
"నిన్న నేను కార్యాలయానికి వెళ్లేసరికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. పౌరులను దుర్భాషలాడడానికి ఎవరు అధికారం ఇచ్చారు. పై అధికారులకు సమాచారం అందించకుండా క్రింది స్థాయి వాళ్లు ఇలా చేస్తారా? ప్రజాప్రతినిధిగా అధికారులను అడిగే హక్కు మాకుంది. ఎవ్వరినైనా నిలదీస్తాం.. పరిగెట్టించి.. పరిగెట్టించి కొట్టిస్తాం అవసరమైతే. తప్పుచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి గాని... మహిళలు, చిన్నారుల పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదు. బాధితుల పరిస్థితి చూసి వీఆర్వోను అన్నమాట వాస్తవమే... దీనికి సంబంధించి ఉన్నతాధికారులు విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి."
-కేపీ వివేకానంద, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే.