Ministers on Buying TRS MLAs Issue: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు అంశంపై ప్రగతిభవన్‌లో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో భాజపా నేతలు అడ్డంగా దొరికిపోయారని.. వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన మఠాధిపతులు, స్వామిజీలు తెలియదని భాజపా చెప్పిందన్న ఆయన.. మరి, సంబంధం లేని కేసులో ఎందుకు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. దర్యాప్తు ఆపాలని ఎందుకు కోరుతున్నారని నిలదీశారు. దీని వెనక ఉన్నది భాజపానే అన్న హరీశ్.. అందుకే సిట్ విచారణ ఆపాలని కోరుతున్నారని ఆరోపించారు.
'8 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను భాజపా కొనుగోలు చేసింది. తెలంగాణలో కొనుగోలుకు వచ్చి భాజపా అడ్డంగా దొరికింది. తెలంగాణ ప్రభుత్వం దొంగలను పట్టుకుని జైళ్లో పెట్టింది. ఈ కేసుకు సంబంధం లేకుంటే భాజపా ప్రధాన కార్యదర్శి కోర్టుకు ఎందుకు వెళ్లారు? దర్యాప్తు జరిగితే బండారం బయటపడుతుందని భాజపాకు భయం పట్టుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రస్తావించింది. వీడియోల సంభాషణల్లో అర్థమైన వ్యక్తి రాహుల్‌గాంధీపై పోటీ చేసిన తుషార్. గవర్నర్ తమిళిసై తుషార్ పేరు ఎందుకు ప్రస్తావించారో తెలియదు.'-హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఎమ్మెల్యేల కొనుగోలును సీబీఐకి ఇవ్వాలని భాజపా అంటోందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసులపై భాజపాకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. భాజపాకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే సిట్ విచారణకు సహకరించాలన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ వేశామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో భాజపా పెద్దలు ఉన్నారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.