Srinivas goud on bandi sanjay: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనీస సంస్కారం లేకుండా వీధి రౌడి భాష మాట్లాడుతున్నారని... రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. బండి సంజయ్ కౌన్సిలర్ స్థాయికి కూడా పనికిరారని.. పాదయాత్రల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలు వస్తున్నాయని పాదయాత్రలు మొదలు పెట్టి మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
పచ్చటి పాలమూరును విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 20 వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యేదని జేపీ నడ్డా కనీన పరిజ్ఞానం లేని విధంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. తెరాసకు కాళేశ్వరం ఏటీఎం అయితే... ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ భాజపా ఏటీఎంలా అని ప్రశ్నించారు.
ఎల్ఐసీ, పవన్ హన్స్‌లకు ఎందుకు తక్కువ ధరలకు అమ్మేశారో... ఎంత అవినీతి జరిగిందో భాజపా నేతలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. తెరాస రజాకార్ల పార్టీ కాదని.. భాజపానే బందిపోట్లు, జేబుదొంగల పార్టీ అని శ్రీనివాస్ గౌడ్ విరుచుకుపడ్డారు.
''భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాలమూరు సభా వేదికగా అన్ని అబద్దాలే చెప్పారు. బండి భాష సరిగా లేదు. ఓ వీధిరౌడీ మాట్లాడినట్లు మాట్లాడారు. వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదు. తెరాసకు కాళేశ్వరం ఏటీఎం అయితే... ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ భాజపా ఏటీఎంలా? ఎల్ఐసీ, పవన్ హన్స్‌లకు ఎందుకు తక్కువ ధరలకు అమ్మేశారో... ఎంత అవినీతి జరిగిందో భాజపా నేతలు చెప్పాలి?''