ఏపీ ప్రాజెక్టులపై మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు ఆంధ్రా ప్రజలను ఉద్దేశించినవి కావని... అది తెరాస విధానం కాదని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం రైతులకు అన్యాయం చేసే ప్రాజెక్టులను కడుతున్న ఆంధ్రా పాలకులపైనేనని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనేదే సీఎం కేసీఆర్ విధానమని ఓ ప్రకటనలో వెల్లడించారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారనేదే తమ బాధ అని మంత్రి అన్నారు.
అప్పుడు రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ నీళ్లు దోచుకెళ్తే... ఇప్పుడు జగన్ అంతకు రెట్టింపు నీళ్లు తీసుకెళ్తున్నారని ఆక్షేపించారు. ఒక్క శ్రీశైలం నుంచే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి లిఫ్ట్‌ల ద్వారా రోజుకు 9 టీఎంసీలకు పైగా నీటిని మళ్లిస్తున్నారని ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. రెండు రాష్ట్రాల భాజపా అధ్యక్షులు బాధ్యత తీసుకోవాలని... అప్పటి వరకు ఏపీ ప్రభుత్వం కడుతున్న ఆర్డీఎస్ కుడికాలువ, రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేయాలని డిమాండ్ చేశారు.