తెలంగాణ

telangana

ETV Bharat / state

100 శాతం పత్తి కొనుగోలుకు సీసీఐ హామీ: నిరంజన్​ రెడ్డి

భారీ వర్షాలు, వరదలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని భారత పత్తి సంస్థ సీసీఐ ఛైర్మన్ ప్రదీప్ కుమార్​కు రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. తేమ నిబంధనను పూర్తిగా సవరించి... ఇంకా పెంచాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

minister Niranjan reddy meet cci chairman Pradeep Kumar
100 శాతం పత్తి కొనుగోలుకు సీసీఐ హామీ: నిరంజన్​ రెడ్డి

By

Published : Nov 3, 2020, 4:42 PM IST

రాష్ట్రంలో 100 శాతం పత్తి కొనుగోలుకు సీసీఐ హామీ ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నాలుగు రోజుల మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ముంబయిలోని ప్రధాన కార్యాలయంలో భారత పత్తి సంస్థ - సీసీఐ ఛైర్మన్ ప్రదీప్‌ కుమార్‌తో మంత్రి భేటీ అయ్యారు.

తేమశాతం సవరించండి..

ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం 60 లక్షల ఎకరాలకు పైగా పెరిగిందని... ఇదే తరుణంలో భారీ వర్షాలు, వరదలు సంభవించి పంట మొత్తం నీటిలో తడిసిపోయి రైతులకు తీవ్రనష్టం వాటిల్లందని సీసీఐ సీఎండీ దృష్టికి మంత్రి నిరంజన్​ రెడ్డి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పత్తి కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేందుకు... వీలుగా 12 శాతం తేమ నిబంధన పూర్తిగా సవరించి... ఇంకా పెంచాలని విజ్ఞప్తి చేశారు.

సానుకూలంగా స్పందించారు..

రాష్ట్రంలో జిన్నింగ్‌, ప్రెస్సింగ్ మిల్లుల సంఖ్య పెంపుపై, పత్తి ఉత్పత్తి, కొనుగోలులో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చొరవ, మంత్రి కృషిని సీఎండీ అభినందించారు. 2019-20 సంవత్సరానికి సంబంధించి 49.56 లక్షల పత్తి బేళ్లను సీసీఐ నిల్వ చేయగా... అందులో 9.28 లక్షల బేళ్లు మాత్రమే తరలించిందని వివరించారు. పాత నిల్వలను వెంటనే తరలించడంతోపాటు... కొత్తగా కొనుగోలు చేసిన పత్తి నిల్వలకు సహకరించాలని మంత్రి చేసిన విజ్ఞప్తిపై అధికారులు సానుకూలంగా స్పందించారు.

జౌళి శాఖ పరిధిలోకి తీసుకురండి..

నాణ్యమైన పత్తి ఉత్పత్తికి తెలంగాణ ప్రసిద్ధి అని... పత్తి కొనుగోలుకు ప్రభుత్వం అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌... దేశానికి ఆదర్శంగా నిలిచిందని నిరంజన్​ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 105.1 లక్షల బేళ్ల కొనుగోలు చేయగా... ఒక్క తెలంగాణ నుంచే 41.8 లక్షల బేళ్లు కొనుగోలు చేసినట్లు వివరించారు. పత్తి పంటకు సంబంధించిన అన్ని విషయాలను... కేంద్రం జౌళి శాఖ పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పత్తి క్వింటాల్‌ కనీస మద్దతు ధర 5,825 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామని సీసీఐ సీఎండీ అంగీకరించారని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ మందుల సామేలు, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీభాయి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:పత్తి రైతుల ఆశలు అడియాశలు... నిండాముంచిన పరిస్థితులు

ABOUT THE AUTHOR

...view details