తెలంగాణ

telangana

By

Published : May 14, 2022, 5:00 AM IST

ETV Bharat / state

KTR on Pattana pragathi: ఇంటింటికీ నల్లా... డిజిటల్‌ నంబర్‌

అన్ని పట్టణాలకు మాస్టర్ ప్లాన్​లు రూపొందించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఇంటింటికీ నల్లా, డిజిటల్‌ నంబర్‌ పూర్తికా వాలని తెలిపారు. హైదరాబాద్​లో జరిగిన పట్టణ ప్రగతి సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు.

KTR on Pattana pragathi
పట్టణ ప్రగతి సమావేశంలో మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణ, నగర జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత పురపాలకశాఖదే అని ఆ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. భారీగా జనం పట్టణాలకు చేరుతున్న నేపథ్యంలో అందుకు తగ్గ మౌలిక వసతుల కల్పన సవాల్‌గా మారిందన్నారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల అయిదో తేదీ వరకు రాష్ట్రంలో జరిగే పట్టణ ప్రగతి నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో నగర మేయర్లు, పురపాలక ఛైర్‌పర్సన్‌లు, కమిషనర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లోని ప్రతి ఇంటికి 2023 మార్చి 31 నాటికి మంచినీటి కనెక్షన్‌ అందించాలన్నారు. అన్ని పట్టణాలు, నగరాలకు మాస్టర్‌ ప్లాన్‌లు రూపొందించాలన్నారు. ఆధునిక ధోబీఘాట్‌లను ఏర్పాటు చేయాలన్నారు. వెజ్‌, నాన్‌వెజ్‌ మోడల్‌ మార్కెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు బయోమైనింగ్‌ చేపట్టాలని, మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాలను అందుబాటులోకి తేవాలని, వైకుంఠధామాలను పూర్తి చేయాలన్నారు. ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి డిజిటల్‌ ఇంటినంబర్ల ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారం లక్ష్యాలను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. కీలకమైన మౌలిక వసతుల కల్పన భారం స్థానిక పురపాలికలపై వేయకుండా తాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వమే చేపడుతోందన్నారు.

అవినీతి ఎక్కడ ఉందని ప్రజలను సర్వేల్లో అడిగితే వాళ్లు చెప్పే మొదటి పేరు రెవెన్యూ శాఖ. తర్వాత రెండు లేదా మూడో స్థానంలో మున్సిపల్‌ శాఖ ఉంటుంది. ఇది ఏళ్లుగా నెలకొన్న పరిస్థితి. ఈ పేరును పోగొట్టాలి. పైసా లంచం లేకుండా భవన నిర్మాణ అనుమతి ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవాలి. భవననిర్మాణ అనుమతుల్లో టీఎస్‌బీపాస్‌ నిబంధనలు ఎవరు అతిక్రమించినా దుర్వినియోగం చేసినా ప్రజాప్రతినిధుల పదవులు, అధికారుల ఉద్యోగాలు పోతాయి -కేటీఆర్‌

కఠిన చర్యలు:టీఎస్‌బీపాస్‌ చట్టంలో నిర్దేశించిన మేరకు భవన నిర్మాణ అనుమతులను 21 రోజుల్లో అందజేేయాల్సిందే అన్నారు. ఈ అంశంలో ప్రజాప్రతినిధులు లేదా, పురపాలక అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త పురపాలికలకు అదనపు సిబ్బందిని ఇవ్వకున్నా ఉన్నవారితోనే బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. త్వరలోనే సిబ్బంది కొరత సమస్య పరిష్కారానికి రిక్రూట్‌మెంట్‌ జరుగుతుందన్నారు. కౌన్సిల్‌ సమావేశాల్లో పురపాలక అధికారులు, ఉద్యోగులపై గట్టిగా మాట్లాడటం, అరవడం సరికాదన్నారు. ఏటా తెలంగాణ ఆవిర్భావం రోజు ప్రతి కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ప్రగతి నివేదికను విడుదల చేసి అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి పనికీ మున్సిపల్‌ కమిషనర్‌ను సంప్రదించే అవసరం లేకుండా ప్రతి వార్డుకు ఒక అధికారిని బాధ్యులుగా నియమించాలని ఆదేశించారు. వినూత్న కార్యక్రమాలతో ప్రత్యేకంగా వ్యవహరిస్తున్న నారాయణపేట, సూర్యాపేట పురపాలక ఛైర్‌పర్సన్‌లు, కమిషనర్లను మంత్రి అభినందించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ తరహాలో రాష్ట్రంలో కూడా పురపాలికలకు అవార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు.

పల్లెప్రగతి ఏర్పాట్లపై 16న సమావేశం: రాష్ట్రంలో ఈనెల 20 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు నిర్వహించనున్న పల్లెప్రగతి కార్యక్రమ ఏర్పాట్లపై 16న పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు క్షేత్రస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సీఈవోలు, డీఆర్‌డీవోలు, డీపీవోలు, పంచాయతీరాజ్‌ ఇంజినీర్లు, డీఎల్‌పీవో, ఏపీవో, ఎంపీడీవో, ఎంపీవో, జిల్లా, మండల పరిషత్‌ ఛైర్మన్లు, సర్పంచులు పాల్గొంటారని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇవీ చూడండి:భాగ్యనగరానికి మంచినీటి సరఫరాకు కొత్త ప్రాజెక్టు... రేపే శంకుస్థాపన

దిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 27 మంది సజీవ దహనం

ABOUT THE AUTHOR

...view details