KTR Teleconference meeting: రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలని మంత్రి కేటీఆర్ ఆ పార్టీ నాయకులకు దిశనిర్దేశం చేశారు. బీఅర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికలకు గులాబీ సైన్యం సమరోత్సాహంతో కదంతొక్కాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 25వ తేదీన జరగబోయే ప్రతినిధుల సభలు రాబోవు ఎన్నికలకు బలమైన పునాదిరాళ్లని పేర్కొన్నారు.
పీఎంపై వ్యంగ్యస్త్రాలు: తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మారిన తెలంగాణ ముఖచిత్రంపై సభల్లో తీర్మానాలు చేయాలని ఆదేశించారు. దేశంలో కేసిఆర్ అంటే సంక్షేమం.. మోదీ అంటే సంక్షోభమని.. ప్రధాన మంత్రిపై వ్యంగ్యాస్త్రాలు విసిరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దేశప్రజలకు ముఖ్యమంత్రి, ప్రధానికి మధ్య వ్యత్యాసాన్ని వివరించాలని సూచించారు. మోదీ అంటే మొండిచెయ్యి అన్న నినాదం.. ప్రతి గడపకు చేరాల్సి ఉందని సూచించారు.
నాయకులకు దిశానిర్దేశం: నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సభలో కనీసం 6 రకాల తీర్మానాలు చేయాలని అందులో ప్రధానంగా వ్యవసాయం, సంక్షేమం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, విద్య, ఉపాధి. బీజేపీ వైఫల్యాలు స్థానిక అంశాలపై తీర్మానాలు కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతినిధుల సభలో చేసే తీర్మానాలు ప్రజలను ఆలోచింపజేసేలా ఉండాలన్నారు. నియోజకవర్గ ప్రతినిధుల సభల ద్వారా నాలుగు లక్షల మంది పార్టీ శ్రేణులకు అన్ని అంశాలపైన రాజకీయంగా దిశానిర్దేశం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.