Harish Rao: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నందున అంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. కరోనా కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్న తరుణంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అమెరికా, ఉత్తరకొరియా, జర్మనీలో భారీగా కేసులు పెరిగాయని.. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడులో కేసులు రెట్టింపు అవుతున్నాయని మంత్రి తెలిపారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉన్నా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణలో ఉన్నా వైద్యారోగ్య శాఖ సిబ్బంది విధుల్లో అలసత్వంతో ఉండరాదని సూచించారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా సిద్ధంగా ఉందని చెప్పారు. శాఖాపరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి అన్నారు.