కరోనా తగ్గిందనుకున్న సమయంలో సెకండ్ వేవ్ మొదలైందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దేశంలోని మొత్తం కేసుల్లో 50 శాతం మహారాష్ట్ర నుంచే వస్తున్నాయని వెల్లడించారు. సరిహద్దుల్లో ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. టీకాలు లేక ఇవాళ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ నిలిచిపోయిందని... ఇవాళ రాత్రికి 2.7 లక్షల టీకా డోసులు రాష్ట్రానికి వస్తాయని స్పష్టం చేశారు. టీకాల సమస్యను, ఆక్సిజన్ కొరతను కేంద్రం త్వరగా పరిష్కరించాలని సూచించారు. మన రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత సమస్య అంతగా లేదని వెల్లడించారు. అవసరం లేనివారికి ఆక్సిజన్ పెట్టవద్దని కోరారు.
రాష్ట్రానికి రానున్న 2.7లక్షల వ్యాక్సిన్లు.. బెడ్ల కొరత లేదన్న ఈటల - కొవిడ్ వార్తలు
టీకాల సమస్యను కేంద్రం త్వరగా పరిష్కరించాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లక్షణాలు కనిపించకపోవడం వల్లనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం వైరస్ బాధితుల్లో లక్షణాలు కనిపించడం లేదన్న ఈటల... వైరస్ సోకిన 3-4 రోజులకు లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించారు. లక్షణాలు కనిపించకపోవడం వల్లే ఇతరులకు త్వరగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. అనవసరంగా అందరికీ రెమిడెసివర్ ఇంజెక్షన్స్ ఇవ్వొద్దని... చివరి అస్త్రంగా మాత్రమే రెమిడెసివర్ ఇవ్వాలన్నారు. కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత రెమిడెసివర్ ఉత్పత్తి తగ్గిపోయిందని... త్వరలోనే కావల్సినన్ని రెమిడెసివర్ ఇంజెక్షన్లు సరిపడా లభిస్తాయని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి:ఆక్సిజన్ కొరతతో ఆరుగురు రోగులు మృతి