Errabelli Unveiled Employment Guarantee Scheme Calendar: పేదలు, కూలీలకు ఉపాధి అందిస్తున్న ఉపాధిహామీ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఉపాధిహామీ పథకం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. తెలంగాణ ఈజీఎస్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఉపాధిహామీ కింద తెలంగాణ ప్రభుత్వమే అత్యంత ప్రజోపయోగ పనులు చేసిందన్న దయాకర్ రావు.. ప్రభుత్వ పథకాలను విజయవంతం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ను కాపాడుకోవాలని కోరారు.
బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉపాధిహామీ నిధులకు కోత పెడుతోందని.. నిన్నటి బడ్జెట్లోనూ ఉపాధిహామీ నిధులను రూ.89వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లకు తగ్గించారని మంత్రి ఆరోపించారు. ఉపాధిహామీకి నిధుల తగ్గింపు పేదల, కూలీల వ్యతిరేక కేంద్ర విధానాలకు నిదర్శనమని అన్నారు. పనిదినాలు పెంచాలని కోరినా పెంచకుండా, నిధులు ఇవ్వకుండా కేంద్రం కూలీల పొట్టగొడుతోందని మంత్రి ఎర్రబెల్లి ఆక్షేపించారు.
ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే ఆలోచనలో కేంద్రం:బడ్జెట్‌లో ఉపాధిహామీ పథకం నిధులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శలు గుప్పించారు. గతంలో రూ.89 వేల కోట్ల కేటాయింపులు ఉండేవని తెలిపారు. కానీ ఇప్పుడు రూ.60వేల కోట్లకు తగ్గించారని మంత్రి మండిపడ్డారు. ఈ పథకాన్ని మోదీ సర్కారు పూర్తిగా ఎత్తేసే ఆలోచనలో ఉందని ఆరోపణలు చేశారు. కేంద్రం వైఖరి వల్ల కూలీలు, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఉపాధి హామీకి నిధుల కోతపై కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు స్పందించాలని ఎర్రబెల్లి సూచించారు.