ఏటా బల్దియా అధికారులు కూలేందుకు సిద్ధంగా ఉన్న శిథిల భవనాలపై వర్షాకాలానికి ముందే సర్వే చేసి చర్యలు చేపట్టేవారు. ప్రణాళిక విభాగం ఈ దఫా చేతులెత్తేసింది. గత యేడాది నోటీసులు జారీ చేసినవాటినీ పట్టించుకోలేదు. మార్చి చివరి వారం నుంచి ఇటీవల వరకు అధికశాతం అధికారులు, సిబ్బంది కొవిడ్ కట్టడి విధుల్లో నిమగ్నమయ్యరని, శిథిల భవనాల కూల్చివేత ఆశించిన స్థాయిలో జరగలేదని యంత్రాంగం చెబుతోంది.
పొంచి ఉన్న ప్రమాదం.. వరుస వర్షాలతో నానుతున్న శిథిల కట్టడాలు.. - many old building were cracked due to rain in hyderabad
ప్రస్తుతం రోజూ వానలు పడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని సమస్యాత్మక ప్రాంతాలవారు బిక్కుబిక్కుమంటున్నారు. మహానగరంలో వందేళ్లకు పూర్వం నిర్మించిన అనేక భవనాలు అడుగడుగునా కనిపిస్తుంటాయి. మట్టి గోడలతో కట్టినవి, నిజాం కాలంలో నిర్మించిన సముదాయాలకు కొదవలేదు.
కొన్నింటిలో యజమానులు, మరికొన్నింటిలో కిరాయిదారులు ఉంటున్నారు. ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్నవి దుకాణాలుగా మారాయి. బల్దియా అధికారులు ఐదేళ్లుగా శిథిల భవనాలను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంతో చాలా మంది వాటిని తొలగించి కొత్తవి కట్టుకున్నారు. సమస్యంతా అద్దెకు ఇచ్చిన భవనాలతోనే అని అధికారులు చెబుతున్నారు. అక్కడే ఉంటూ దశాబ్దాల తరబడి అదే సముదాయాల్లో ఉంటున్నామంటూ చాలా మంది ఖాళీ చేయట్లేదు. పలువురు న్యాయస్థానాన్ని సైతం సంప్రదించారు. కూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్న నిర్మాణాలపై తప్పక చర్యలు తీసుకోవాల్సిందేనంటూ అధికారులు నోటీసులైతే ఇస్తున్నారు. తీసుకోకపోతే తలుపులకు అంటించి, గడువు పూర్తయ్యాక పోలీసుల సాయంతో తొలగిస్తున్న దాఖలాలున్నాయి. ఈ ఏడాది మరో 300 వరకు భవనాలు కూలే స్థితిలో ఉండగా కొవిడ్ పేరుతో అధికారులు దృష్టిపెట్టలేదు.
ఓ మోస్తరు వానలు పడితే చాలు అవి చిగురుటాకులా వణుకుతాయి. పెచ్చులూడి పడుతూ, కారిపోతూ హడలెత్తిస్తుంటాయి. ఏ అర్ధరాత్రినో, తెల్లవారుజామునో అమాంతం కూలి ఆస్తి, ప్రాణ నష్టాలు కలిగిస్తుంటాయి. హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలమంతటా శిథిల భవనాలతో ఉత్పన్నమయ్యే పరిస్థితి ఇది.
నోటీసులిచ్చి వదిలేస్తున్నారు..
- ఎంజే మార్కెట్ సమీపంలోని బ్యాచిలర్ భవన్‌ను వందేళ్లకు ముందు నిర్మించారు. అప్పట్లో గ్రామాల నుంచి నగరానికి వచ్చే యువకులకు తక్కువ వ్యయంతో బస కల్పించడం కోసం దీనిని నిర్మించినట్లు చెబుతారు. ఇప్పుడు దుకాణాలు, వ్యాపార కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రధాన రహదారి పక్కనే పెచ్చులూడి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ఖాళీ చేయించేందుకు అధికారులు నోటీసుల వరకే పరిమితం.
- అలియాబాద్ మేకలబండ ప్రాంతంలో మట్టితో నిర్మించిన ఇళ్లు 20 వరకు ఉన్నాయి. అన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. గతేడాది వాటిని కూల్చేస్తామని అధికారులు నోటీసులిచ్చినా ఇప్పటివరకు అటు చూడలేదు.
- చార్మినార్ వద్ద నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లన్నింటిలో శిథిల భవనాలు ఉన్నాయి. మరమ్మతులు లేకుండానే కొనసాగుతున్నాయి.
అత్యధిక శిథిల భవనాలు ఉన్న ప్రాంతాలు
- కూలేందుకు సిద్ధంగా ఉన్నవి 300
- ఈ ఏడాది ఇప్పటివరకు కూల్చిన శిథిల ఇళ్లు: 202