తెలంగాణ

telangana

ETV Bharat / state

నామినేటెడ్​ పదవుల భర్తీపై కేసీఆర్​ నజర్​!

నిన్న మెున్నటి వరకు ఎన్నికల పై దృష్టి పెట్టిన గులాబీ దళపతి...ఇప్పుడు నామినేటెడ్​ పదవుల భర్తీపై కసరత్తు ప్రారంభించారు. ఆశావహులంతా వివిధ  కార్పొరేషన్ ఛైర్మన్​ పదవులతో పాటు... డైరెక్టర్ పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పదవీకాలం పూర్తయిన వారు మరోసారి కొనసాగేందుకు ప్రయత్నిస్తుండగా... ఈ సారైనా తమకు అవకాశం ఇవ్వాలని కొత్త వారు నేతల చుట్టూ తిరుగుతున్నారు. మంత్రి పదవి ఇవ్వక పోయినా... కనీసం కేబినెట్ హోదా ఉన్న కుర్చీ అయినా దక్కించుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆశపడుతున్నారు.

trs

By

Published : Aug 20, 2019, 10:49 PM IST

నామినేటెడ్​ పదవుల భర్తీపై కేసీఆర్​ నజర్​!

గులాబీ బాస్​ కేసీఆర్​ నామినేటెడ్​ పదవుల భర్తీపై కసరత్తు ప్రారంభించారు. అయితే అన్నీ ఒకేసారి కాకుండా క్రమక్రమంగా నేతలకు పదవులు కట్టబెట్టే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత బి.వినోద్ కుమార్ ను ఇటీవల నియమించారు. ప్రభుత్వ సలహాదారుడిగా సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్​ను నియమించిన ప్రభుత్వం... మీడియా అకాడమీ ఛైర్మన్​గా అల్లం నారాయణను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​గా మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్​గా తాడూరి శ్రీనివాస్​ను నియమించారు. సందర్భానుసారంగా ఒక్కొక్కటిగా భర్తీ చేస్తుండటం వల్ల... ఆశావహులు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు.

ఖాళీలు ఇవే...

శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులతోపాటు... రాష్ట్రంలో సుమారు 30 వరకు కార్పొరేషన్లలో ఛైర్మన్, డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన మిషన్ భగీరథ, ఆర్టీసీ, ఎస్సీ కార్పొరేషన్, సాంస్కృతిక సారథి, మూసీ నది అభివృద్ధి సంస్థ, ట్రైకార్, రహదారి అభివృద్ధి సంస్థ, టీఎస్టీఎస్, వికలాంగుల అభివృద్ధి, బేవరేజెస్ , మహిళా -శిశుసంక్షేమ, ఆగ్రోస్, చలనచిత్ర అభివృద్ధి, గిడ్డంగుల సంస్థ, నీటిపారుదల అభివృద్ధి సంస్థ, నెడ్ క్యాప్, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ తదితర పదవులు ఖాళీగా ఉన్నాయి.
ప్రయత్నాలు ముమ్మరం
పోటీ చేసే ఉద్దేశంతో కొందరు ఎన్నికలవేళ రాజీనామా చేయగా.. మరికొందరి రెండేళ్ల పదవీకాలం ముగిసినందున ఆ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. మరోసారి అవకాశం కోసం పాత వారు ప్రయత్నిస్తుండగా... ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని కొత్తవారు కోరుతున్నారు. అలాగే కొందరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్​కు నామినేటెడ్ పోస్టు ఇస్తామని స్వయంగా కేసీఆర్ పార్టీ సమావేశంలో పేర్కొన్నారు. కీలకమైన మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడి పోస్టుకు సీఎంకు సన్నిహితుడిగా పేరున్న ఓ తెరాస ప్రధాన కార్యదర్శి పేరు వినిపిస్తోంది.

అలాగే దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, తేజావత్ రామచంద్రుడు , మందా జగన్నాథం పదవీకాలం సైతం పూర్తైంది. పార్లమెంటరీ కార్యదర్శులను నియమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. దీనిపై త్వరలో స్పష్టత వస్తుందని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆశలు పెట్టుకున్నారు. ఎంత మంది పాత వారిని కొనసాగిస్తారు...కొత్తవారికి ఏ ఏ పదవులు కట్టాబెడుతారు అనే అంశం ఉత్కంఠను రేపుతోంది. పదవులు ఆశించి దక్కని వారి నిర్ణయం ఎలా ఉంటుదనేది ఆసక్తిని కల్గిస్తోంది.

ఇదీచూడండి:కలెక్టర్లతో ముగిసిన సీఎం కేసీఆర్​ సమావేశం

ABOUT THE AUTHOR

...view details