Kavitha To Attend Trial In Delhi Liquor Case: ఈ మధ్య కాలంలో దిల్లీ మద్యం కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేసిన ఈడీ.. తాజాగా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 8 నోటీసులు జారీ చేసింది. అయితే కొన్ని కార్యకలాపాల వల్ల విచారణకు 11వ తేదీన వస్తానని కవిత ఈడీని కోరింది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత దిల్లీ అక్రమ మద్యం కేసులో ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. దిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉదయం 10.30 తర్వాత ఆమెను విచారించి.. పలు విషయాలను రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఈనెల 9నే విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ముందస్తు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున 9వ తేదీ విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ కవిత రాశారు.
ఈనెల 11న విచారణకు హాజరుకానున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ కవితను.. ఎన్‌ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ ప్రశ్నించనున్న తరుణంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు మొదలైన వారు హుటాహుటిన దిల్లీ వెళ్లారు. ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ ఎంపీలు దిల్లీ చేరుకోగా.. మరికొందరు బీఆర్ఎస్ నేతలు ఈ ఉదయం దిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది.