Global Recognition for kaleshwaram project :కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్... కాళేశ్వరం ప్రాజెక్టును 'ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్'గా గుర్తించి అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వీకరించారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని హెండర్సన్ నగరంలో ‘అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రపంచ పర్యావరణ, జల వనరుల సదస్సు’లో మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సదస్సులో ప్రపంచ ఇంజినీరింగ్ నిపుణులు, సామాజికవేత్తలు, పరిశ్రమవర్గాలకు చెందినవారు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో నీటి కరవు.. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అతి తక్కువ సమయంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసిన విధానాన్ని దృశ్యరూపంలో కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
kaleshwaram project recognized as An enduring symbol of engineering progress :తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అవార్డు దక్కటం రాష్ట్రానికి, సీఎం కేసీఆర్ మేధస్సుకు దక్కిన ఒక అపూర్వమైన గుర్తింపుగా కేటీఆర్ అభివర్ణించారు. ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టైన కాళేశ్వరాన్ని అతితక్కువ సమయంలో పూర్తి చేసిందన్నారు. తెలంగాణ రాకముందు సాగునీరు అందక కరవుకు నిలయంగా ఉండేదని... భారీ ప్రాజెక్టుల నిర్మాణాలతో అనేక అద్భుతమైన మార్పులు జరిగాయని.. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా రాష్ట్రం మారిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో శ్వేతవిప్లవం, గులాబీ విప్లవం, నీలి విప్లవం, నూనె గింజల తాలూకు ఎల్లో విప్లవం వ్యవసాయ రంగంలో వస్తున్నాయని వెల్లడించారు. దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్య నుంచి తెలంగాణకు శాశ్వతంగా విముక్తి లభించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో అత్యధిక తలసరి ఆదాయం సాధించిందన్నారు.