తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో జాగ్రత్తగా లేకుంటే అంతే సంగతి: సీసీఎంబీ డైరెక్టర్

కరోనా మహమ్మారి కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయని సంతోషించేలోపే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సెకండ్ వేవ్ ప్రారంభమైయింది. ఫ్రాన్స్ సహా అనేక దేశాలు లాక్ డౌన్​ను ప్రకటించాయి. దిల్లీలోనూ సెకండ్ వేవ్ ప్రారంభమైందని ఇటీవలే సీసీఎంబీ పేర్కొంది. మొదటి వేవ్ కంటే ఈ రెండో వేవ్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ మనచుట్టూ ఉందన్న విషయాన్ని గుర్తుంచుకుని మసులుకోకపోతే... ప్రమాదకర పరిస్థితులు వచ్చే అవకాశం ఉందంటున్న సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రాతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

interview with ccmb director mishra on corona second wave in telangana
జాగ్రత్తగా లేకుంటే అంతే సంగతి: సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా

By

Published : Nov 9, 2020, 7:03 AM IST

కరోనాతో జాగ్రత్తగా లేకుంటే అంతే సంగతి: సీసీఎంబీ డైరెక్టర్

ప్ర: ప్రతి ఒక్కరూ సెకండ్ వేవ్‌ గురించి ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందంటారా?

జ: సెకండ్‌ వేవ్‌ అనేది తప్పక జరిగే చాలా సహజమైన విషయం. అన్ని దేశాల్లోలాగే మన దేశంలోనూ రెండో, మూడో, నాలుగో వేవ్స్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. కచ్చితత్వంతో, సరిపడా పరీక్షలు నిర్వహిస్తే సెకండ్‌ వేవ్‌ వచ్చిందో లేదో తెలుస్తుంది. తెలంగాణ ఆసుపత్రుల్లో కొవిడ్‌ రోగుల సంఖ్య ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. పండుగల వల్ల, ప్రజల అజాగ్రత్త వల్ల మళ్లీ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వైరస్‌ మనచుట్టూ ఉందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు జాగ్రత్తగా లేకుంటే వేల ప్రాంతాల్లో ఒక్కసారిగా కేసులు పెరిగి సంక్షోభానికి దారి తీయవచ్చు. ఆసుపత్రుల్లోనూ ప్రజల్ని కాపాడలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. మనం జాగ్రత్తగా ఉంటే సెకండ్‌, థర్డ్‌ వేవ్‌లు వచ్చినా ఎదుర్కోవడం సులభమే.

ప్ర: కరోనా దేశంలో భాగం కావచ్చని మీరు భావిస్తున్నారా?

జ: వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగల వ్యాక్సిన్‌ రాకపోతే... జలుబు, దగ్గు లాగానే కొవిడ్‌ కూడా జీవనంలో భాగం కావచ్చు.

ప్ర: సెకండ్‌ వేవ్‌ను మనం ఎలా గుర్తించగలం?

జ: పాజిటివ్‌ కేసులు ఒక దశలో భారీగా ఉండి.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టి మళ్లీ ఒక్కసారిగా పెరిగితే దానినే మనం వేవ్‌ అంటున్నాం. మనందరం సామాజిక వ్యాక్సిన్‌గా భావిస్తున్న.. మాస్క్‌, వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం ఈ మూడింటిని పాటించగలిగితే ఈ వ్యాధిని జయించగలం.

ప్ర: వైరస్‌ పుట్టి ఏడాది గడుస్తోంది. ప్రస్తుతం వైరస్‌లో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటున్నాయా?

జ: ప్రస్తుతం ఏ2ఏ రకం వైరస్‌ ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. అక్కడక్కడ తప్ప దాదాపుగా ప్రపంచం మొత్తం ఏ2ఏ తప్ప వేరే మ్యూటేషన్లు లేవు. ఇదే రకం వైరస్‌ ప్రపంచం మొత్తం ఉండబోతోందని అనిపిస్తోంది. వైరస్‌ ఈ రకంగా మార్పు చెందకుండా స్థిరంగా ఉండటం శుభపరిణామం. వ్యాక్సిన్‌ పరిశోధనలు విజయవంతం కావడానికి ఇది ఉపకరిస్తుంది.

ప్ర: తెలంగాణలో ఇప్పటికే లక్షల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. సెకండ్‌ వేవ్‌లో మళ్లీ వీరికి వైరస్‌ సోకే అవకాశం ఉందా?

జ: రెండోసారి వైరస్‌ సోకే అవకాశం చాలా తక్కువ. దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నా రెండోసారి వైరస్‌ బారిన పడినవారు చాలా తక్కువగా ఉన్నారు. దీనిని బట్టి రెండోసారి సోకడం చాలా అరుదనే చెప్పాలి.

ప్ర: శానిటైజర్లు, డిసిన్‌ఫెక్షన్​‌ టన్నెల్స్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇవి నిజంగా ప్రజల ఆరోగ్యానికి మంచివేనా?

జ: శానిటైజింగ్‌ అంటే టన్నెల్స్‌ ద్వారా వెళ్లడం కాదు. నిజానికి శానిటైజర్‌ను పక్కనబెట్టి సబ్బుతో చేతులు కడుక్కోవడం ఉత్తమం. శానిటైజర్‌ కేవలం చేతుల కోసం మాత్రమే. సర్ఫ్​ చేయడం, యూవీ టన్నెల్స్‌ ద్వారా వెళ్లడం సురక్షితమైన పద్ధతి కాదు.

ప్ర: ప్రపంచం మొత్తం వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తోంది. ఏడాదిలోనే వ్యాక్సిన్ వచ్చేందుకు అవకాశాలేంటి? సహజంగా వ్యాక్సిన్ రావడానికి ఎంత సమయం పడుతుంది?

జ: వ్యాక్సిన్‌ కష్టమైన అంశం కాదు గానీ.. సురక్షితమైన వ్యాక్సిన్‌ రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. రష్యా, చైనా వంటి దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌ అందిస్తున్నామని చెబుతున్నా.. అవి సురక్షితమైనవని చెప్పేందుకు సరిపడా సమాచారం లేదు. ఒకవేళ అవి సురక్షితమైనవే అయి వ్యాధినిరోధక శక్తిని పెంచుతున్నా.. పూర్తిగా వైరస్‌ను ఎదుర్కోగలవని చెప్పలేం. సదరు వ్యాక్సిన్లు ఆర్నెళ్లకు మించి వైరస్‌ను ఎదుర్కోగలవని ఎవరూ చెప్పలేరు. గత అనుభవాలను బట్టి చూస్తే సమర్థవంతమైన వ్యాక్సిన్‌ త్వరలోనే రాగలదని కచ్చితంగా చెప్పలేం.

ఇదీ చదవండి:జహంగీర్‌పీర్ దర్గా అభివృద్ధికి రూ.50కోట్లు: కొప్పుల ఈశ్వర్

ABOUT THE AUTHOR

...view details