తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లెల్లో ఇక విద్యుత్‌ ఆదాచేసే ఎల్‌ఈడీ వెలుగులు - తెలంగాణ విశేషాలు

LED Streetlights Across the State: పల్లెపల్లెలో ఇక తెలుపురంగు ఎల్‌ఈడీ దీపాలు వెలుగులు పంచనున్నాయి. ఇంతకాలం విద్యుత్‌ బిల్లులు కట్టలేక.. పాడైన వీధిదీపాలను మార్చలేక అంధకారంలో మగ్గే గ్రామాలకు ఆ బాధలు తప్పనున్నాయి. ఈమేరకు ‘ఇంధన సంరక్షణ పథకం’ అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా శ్రీకారం చుట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,789 గ్రామాల్లో పాత వీధి దీపాలను తొలగించి వాటి స్థానంలో విద్యుత్‌ ఆదాచేసే ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.

LED Streetlights Across the State
LED Streetlights Across the State

By

Published : Nov 18, 2022, 9:05 AM IST

LED Streetlights Across the State: ప్రస్తుతం 6 జిల్లాల్లోని (వరంగల్‌, జనగాం, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట, నల్గొండ, సంగారెడ్డి) 2,630 గ్రామాల్లో పనులు చకచకా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇంధన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ పనులకు కేంద్ర ప్రభుత్వ ‘ఇంధన సామర్థ్య సేవల సంస్థ (ఈఈఎస్‌ఎల్‌)’ నిధులను మంజూరు చేసింది. ఈ పనుల నిర్వహణకు ‘తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్కో)’ను నోడల్‌ ఏజెన్సీగా నియమించింది.

రాష్ట్రంలో ప్రాజెక్టు ఖర్చు కింద రూ.295 కోట్లను కేటాయించింది. రాబోయే 9 నెలల్లో రాష్ట్రమంతటా ఎల్‌ఈడీ వీధిలైట్ల ఏర్పాటు పూర్తవుతుంది. ప్రస్తుతం గ్రామాల్లో వీధి దీపాలకు సాధారణ బల్బులను అమర్చారు. వీటి నిర్వహణ పంచాయతీలకు భారంగా మారింది. విద్యుత్‌ బిల్లు ఏడాదికి ఒక్కో బల్బుకు సగటున రూ.1,330 చొప్పున చెల్లించాల్సి వస్తోంది.

వీటిని కట్టలేక పలు పంచాయతీలు చేతులెత్తేస్తుండగా.. వాటికి విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని పంపిణీ సంస్థలు తరచూ హెచ్చరిస్తున్నాయి. దీపాలు పాడైనచోట కొత్తవి ఏర్పాటు చేయడానికి కొన్నిచోట్ల నెలల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటుచేస్తే విద్యుత్‌ ఆదా కావడంతో బిల్లుల ఆర్థికభారం ఏటా రూ.100 కోట్ల వరకూ తగ్గుతుందని ఈఈఎస్‌ఎల్‌ అధ్యయనంలో తేలింది.

సాధారణ బల్బు స్థానంలో ఒక ఎల్‌ఈడీ దీపం పెడితే ఏడాదికి విద్యుత్‌ బిల్లు రూ.462 మాత్రమే వస్తుంది. 16 లక్షల ఎల్‌ఈడీ లైట్లు అమరిస్తే ఏటా రాష్ట్రంలో 220 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అవుతుందని ఈఈఎస్‌ఎల్‌ అంచనా వేసింది. ఒకసారి ఇవి ఏర్పాటయ్యాక పూర్తిగా రెడ్కో వాటిని వచ్చే ఏడేళ్ల పాటు నిర్వహిస్తుందని మేనేజింగ్‌ డైరెక్టర్‌ జానయ్య తెలిపారు. గ్రామాల్లో చిన్న, ప్రధాన వీధులు, కూడళ్లు, హైవేలలో అవసరాన్ని బట్టి 18, 35, 79, 110, 190 వాట్ల సామర్థ్యం గల దీపాలను ఏర్పాటుచేస్తున్నట్లు రెడ్కో ఛైర్మన్‌ సతీశ్‌రెడ్డి ‘ఈనాడు’కు వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details