BJP held a massive rally across the state: వైద్య విద్యార్థి ప్రీతి నాయక్ ఘటనతో పాటు, రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నేడు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇవాళ సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్లో బషీర్బాగ్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించారు.
మహిళలపై రోజు రోజుకి అత్యాచారాలు పెరుగుతున్నాయ్:బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఇంఛార్జీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యాచారాలకు నిరసనగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ర్యాలీలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రంలో విద్యార్థినులపై, మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయని బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్లో ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న వాటిపై కేసీఆర్ స్పందించరేం?:బీఆర్ఎస్, ఎంఐఎం అండతో అత్యాచారాలు, హత్యలు చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అత్యాచారాలు, హత్యలను సైతం చిన్న నేరాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు గణనీయంగా పెరిగినప్పటికీ సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. కనీసం అధికారులతో సమీక్ష కూడా చేయకపోవడం చూస్తుంటే మహిళల రక్షణపట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ: దొంగ సారా దందాలో అడ్డంగా బుక్కైన తన బిడ్డను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారని ఆరోపించారు. కానీ, రాష్ట్రంలోని అమాయక విద్యార్థినులు, మహిళలపై అన్యాయంగా అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డకో న్యాయం? ఇతరులకో న్యాయమా? అని ప్రశ్నించారు. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ చేపడుతున్న కొవ్వొత్తుల ర్యాలీలకు కార్యకర్తలతోపాటు మహిళా, అభ్యుదయ, ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: