IPS Transfers in Telangana : శాసనసభ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ.. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. అధికారులు, ఉద్యోగుల బదిలీలు, పోస్టింగుల విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణా విధుల్లో ఉండే అధికారుల విషయమై మార్గదర్శకాలు పేర్కొంది. సొంత జిల్లాల్లో పని చేయరాదని, మూడేళ్లకు మించి అక్కడే కొనసాగరాదని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా రెవెన్యూ, పోలీసు సహా ఇతర అధికారులు తమ విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది.
IAS IPS Transfers in Telangana 2023 : అధికారులు, ఉద్యోగుల బదిలీ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈసీ మార్గదర్శకాలకు లోబడిలేని అధికారుల బదిలీలపై దృష్టి సారించింది. జిల్లా ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించే ఐఏఎస్ అధికారులు నలుగురిని బదిలీచేయాల్సి ఉంటుందని అంటున్నారు. కొన్ని జిల్లాల ఎస్పీలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల బాధ్యతల్లో ఉన్న పలువురిని కూడా బదిలీ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. కొన్నిచోట్ల ఇన్‌ఛార్జీలు ఉన్న పరిస్థితుల్లో పూర్తి స్థాయి అధికారులను కూడా నియమించాల్సి ఉంది. మొత్తంగా చూస్తే వంద వరకు అధికారుల బదిలీలు జరగవచ్చని అంటున్నారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ కసరత్తు ఉన్నత స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం. ఈసీ మార్గదర్శకాలకు లోబడి ఉండేలా బదిలీలు చేయడంతో పాటు మరికొంత మందిని కూడా బదిలీ చేయవచ్చని అంటున్నారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో కూడా ఇప్పటికే కసరత్తు పూర్తైంది. ఆ జాబితాను ముఖ్యమంత్రి పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 22తో వేడుకలు పూర్తవుతాయి. దీంతో ఆ తర్వాత బదిలీలు జరగవచ్చని అంటున్నారు. ఎన్నికల సమయం అయినందున పాలనా, రాజకీయ పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని బదిలీల ప్రక్రియ పూర్తయి.. కొత్త పోస్టింగులు ఇస్తారని చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగుల విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగియనుండగా.. మధ్యప్రదేశ్ గడువు జనవరి 6, మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17, ఛత్తీస్‌గడ్ గడువు జనవరి 3, రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14తో పూర్తి కానుంది. దీంతో ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఈసీ అదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ విధుల్లో నేరుగా ఉండే అధికారులను సొంత జిల్లాల్లో.. ఎక్కువ కాలం పని చేసిన ప్రాంతాల్లో ఉండరాదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఒకేచోట మూడేళ్ల గడువు మించరాదని స్పష్టం చేసింది.