తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad Metro Losses: మెట్రోను వదలని నష్టాలు... ఆగినా.. నడిపినా అవే కష్టాలు! - Metro News

Hyderabad Metro Losses: హైదరాబాద్‌ మెట్రోను వరుస నష్టాలు వెంటాడుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలపాటు మెట్రో రైళ్లు డిపోకే పరిమితంకాగా... ఆ తర్వాత పునఃప్రారంభం అయినప్పటికీ పూర్తిస్థాయిలో ఆదరణకు నోచుకోలేదు. మెట్రో రైల్‌ కదిలినా, ఆగినా... నష్టాలకు బ్రేక్‌ పడడంలేదు. ఇప్పుడిప్పుడే మరోసారి ప్రయాణికులు మెట్రో వైపు చూస్తున్నారని... వచ్చే నెల నుంచి రోజుకు 5 లక్షల మార్క్‌కు చేరుకుంటామని ఎల్ అండ్ టీ భావిస్తోంది.

Metro
Metro

By

Published : May 9, 2022, 5:05 AM IST

Hyderabad Metro Losses: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ మెట్రో... రాజధానిలో మూడు మార్గాల్లో పరుగులు పెడుతోంది. ఆధునిక ప్రజారవాణాగా తక్కువ వ్యవధిలోనే... ప్రయాణికుల ఆదరణ పొందింది. లాక్‌డౌన్‌కు ముందు సగటున నిత్యం నాలుగు లక్షల మంది మెట్రోలో రాకపోకలు సాగించేవారు. ఆపరేషన్స్‌ పరంగా లాభనష్టాలు లేని దశకు చేరుకుంది. ఏడేళ్లలో మొత్తం మెట్రోనే బ్రేక్‌ ఈవెన్‌కు వస్తుందని భావించారు. కానీ కొవిడ్‌తో అంచనాలన్నీ తలకిందులయ్యాయి.

దెబ్బకొట్టిన కరోనా: 2020లో లాక్‌డౌన్‌ సమయంలో మెట్రోరైలు కార్యకలాపాలు 169 రోజులు డిపోలకే పరిమితమయ్యాయి. పునఃప్రారంభం అయినప్పటికీ... ఏ దశలోనూ ప్రయాణికుల సంఖ్య 2 లక్షల 20 వేలు దాటలేదు. ఆ ఏడాది ఏడు నెలలు మాత్రమే మెట్రో సేవలు అందించగా... రూ. 346 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. మాల్స్‌ తెరిచినా సందర్శకులు లేక ఆ ప్రభావం ఆదాయంపై పడింది. వీటి ద్వారా రూ. 38 కోట్లు మాత్రమే వచ్చిందని ఎల్‌ అండ్‌ టీ సంస్థ తెలిపింది. 2020-21 ఆర్థిక ఏడాదిలో రూ. 386 కోట్లు మాత్రమే వచ్చింది. ఖర్చు మాత్రం రూ. 2వేల152 కోట్లు అయిందని... ఇందులో వడ్డీ చెల్లింపుల వ్యయమే రూ. 14వందల 12 కోట్లు ఉందని వెల్లడించింది.

3 లక్షలు దాటని ప్రయాణికుల సంఖ్య: 2021-22లో ఏడాది పాటు మెట్రోరైళ్లు నడిచినా... ఏదశలోనూ రోజువారీ ప్రయాణికుల సగటు సంఖ్య 3 లక్షలు దాటలేదు. దీంతో ఆదాయం స్వల్పంగా మాత్రమే పెరిగింది. ప్రయాణికుల టిక్కెట్ల ద్వారా రూ. 457 కోట్లు రాగా... మాల్స్, ప్రకటనల ఆదాయం కొంత మెరుగైంది. మొత్తంగా రూ. 17వందల 45 కోట్లు నష్టం వచ్చిందని... ఎల్‌ అండ్‌ టీ మెట్రో వెల్లడించింది. 2019-20లో కొవిడ్‌ ముందు ప్రయాణికుల టిక్కెట్ల ద్వారా రూ. 598 కోట్లు రాగా... మరుసటి ఏడాది రూ. వెయ్యికోట్లపై అంచనా పెట్టుకున్నా కొవిడ్‌ దెబ్బతీసిందని హైదరాబాద్‌ మెట్రో వెల్లడించింది.

జూన్ తర్వాత ఆదరణ: జూన్‌ తర్వాత 5 లక్షల ప్రయాణికుల మార్క్‌కు చేరుకుంటామని మెట్రో వర్గాలు భావిస్తున్నాయి. సెలవు రోజుల్లో 59 టిక్కెట్‌తో ఆదరణ పెరగడంతోపాటు... ఎండాకాలం కావడంతో రాకపోకలు పెరిగాయి. సగటున ప్రతిరోజు 2లక్షల 80 వేల దాకా ప్రయాణిస్తుండగా... ఐటీ కార్యాలయాలు పూర్తిస్థాయిలో తెరిస్తే ప్రయాణికులు రెట్టింపు కానున్నారని అంచనా వేస్తున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details