అన్ని ప్రాంతాల ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు నగరంలో మొదటి దశలో రూ. 313 కోట్లతో 37 మిస్సింగ్ లింక్ రోడ్లను నిర్మిస్తున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. వాటిలో 10 పనులు పూర్తికాగా, మరో 18 పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ సాయిబాబా, జోనల్ కమిషనర్ ఎన్.రవికిరణ్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డిలతో కలిసి శేరిలింగంపల్లి జోన్‌లో మేయర్ పర్యటించారు. ప్రధాన రోడ్లపై ఒత్తిడిని తగ్గించి, నగరంలోని అన్ని ప్రాంతాలను వర్తక వ్యాపార, ఐటీ సముదాయాలకు అనుసంధానం చేస్తూ మిస్సింగ్ లింక్ రోడ్లను నిర్మిస్తున్నట్లు మేయర్ పేర్కొన్నారు. లింక్ రోడ్లకై సేకరించిన ఆస్తులకు దాదాపు రూ. 500 కోట్ల విలువైన టీడీఆర్‌లు జారీచేసినట్లు మేయర్ తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించుటకు ఎస్ఆర్డీపీ కింద ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, స్కైవేలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా నల్లగండ్ల మెయిన్ రోడ్‌లోని రత్నదీప్ నుంచి ఓల్డ్ ముంబయి హైవేకు అనుసంధానం చేసేందుకు 100 అడుగుల వెడల్పుతో నిర్మించనున్న 2 కిలోమీటర్ల మిస్సింగ్ లింక్ రోడ్డు ప్రతిపాదిత రూట్‌ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు.
రాజధానిలో 37 మిస్సింగ్ లింక్ రోడ్లను నిర్మిస్తున్నాం: మేయర్ - జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్
ప్రధాన రోడ్లపై ఒత్తిడిని తగ్గించి, నగరంలోని అన్ని ప్రాంతాలను వర్తక వ్యాపార, ఐటీ సముదాయాలకు అనుసంధానం చేస్తూ మిస్సింగ్ లింక్ రోడ్లను నిర్మిస్తున్నట్లు మేయర్ పేర్కొన్నారు. మొదటి దశలో రూ. 313 కోట్లతో 37మిస్సింగ్ రోడ్లను నిర్మిస్తున్నట్లు మేయర్ తెలిపారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, అధికారులతో కలిసి శేరిలింగంపల్లి జోన్‌లో మేయర్ పర్యటించారు.
ఈ సందర్భంగా నల్లగండ్ల చెరువును పరిశీలించారు. నల్ల చెరువు చుట్టూ నాలుగు కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటుచేసి, హరితహారం కింద సుందరీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మిస్సింగ్ లింక్ రోడ్డు నిర్మాణం, నల్ల చెరువు ఆధునీకరణకు నిధుల మంజూరుకై సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ నుంచి చందానగర్ రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జి వరకు 150 అడుగుల వెడల్పుతో 2.10 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న మిస్సింగ్ లింగ్ రోడ్డును తనిఖీ చేశారు. హెచ్ఆర్డీసీఎల్ ద్వారా ఈ మిస్సింగ్ లింక్ రోడ్డుకు రూ. 11 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనుల్లో 1.75 కిలోమీటర్ల మిస్సింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. అదేవిధంగా చందానగర్ రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జి నుంచి మైహోం వరకు దాదాపు ఒక కిలోమీటరు పొడవున మిస్సింగ్ లింక్ రోడ్డు నిర్మించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
ఇవీ చూడండి: ఖాళీగా ఉన్న పాఠశాలల్లో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి: భట్టి