హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర వాసులు రంగుల్లో మునిగి తేలారు. అక్కడకక్కడా కరోనా భయంతో కాస్త హడావుడి తగ్గినప్పటికీ వసంతకేళీ రంగులను పులుముకుని కాంతులను విరజిల్లింది. అధికారులు... ప్రజాప్రతినిధులు... చిన్నారులు... యువత అనే తేడా లేకుండా రంగుల పండుగను కన్నుల పండువగా జరుపుకున్నారు. రసాయనాలు లేని రంగులు కొందరు జల్లుకుంటే... పలు వర్ణాల రంగుల్లో యువత తడిసి ముద్దైంది.
మంత్రుల సందడి
సిద్దిపేటలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆర్థికమంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. రాష్ట్రప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.... పర్యావరణానికి హాని కలగకుండా పండుగ జరుపుకోవాలన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వేడుకల్లో పాల్గొన్నారు. సిద్ధార్థ నగర్ చిన్నారులతో కలిసి రంగులు పూసుకుని రంగుల పండుగ జరుపుకున్నారు.
కలెక్టర్ కార్యాలయాల్లో రంగుల పండుగ
జగిత్యాల కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రంగుల కేళీ వేడుకలు జరిగాయి. రెవెన్యూ ఉద్యోగులతో కలిసి కలెక్టర్ రవి పండుగ జరుపుకున్నారు. పర్యావరణానికి హాని కలిగించని రంగులే వాడాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా కలెక్టర్ శశాంక సిబ్బందితో హోలీ జరుపుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, ఖమ్మంలో చిన్నారులు రంగునీళ్లు చల్లుకుంటూ సరదాగా గడిపారు.