సచివాలయం కూల్చివేతలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో ప్రతి రోజూ మీడియాకు వివరాలు ఇవ్వగలరా అని ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగింది. సచివాలయం కూల్చివేతల కవరేజీకి అనుమతివ్వాలని కోరుతూ ఓ ఛానల్, పత్రిక దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం విచారణ చేపట్టారు. కూల్చివేతల వద్దకు జర్నలిస్టులను వెళ్లనీయకుండా అడ్డుకోవడం పత్రిక స్వేఛ్చను కాలరాయడమేనని పిటిషనర్ తరఫు న్యాయవాది నవీన్ వాదించారు. అయితే వార్తలు కవర్ చేయకుండా ఎవరు అడ్డుకోవడం లేదు కదా అని హైకోర్టు పేర్కొంది. కూల్చివేతల వద్ద పేలుళ్ల వంటి పద్ధతులు వాడితే.. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నిచింది. కూల్చివేతలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రజల్లో ఉన్నదని.. ఇంజినీర్లు, అధికారుల సూచనల మేరకే కవర్ చేస్తామని ఛానెల్, పత్రిక తరఫు న్యాయవాది తెలిపారు.
సచివాలయం కూల్చివేతలపై మీడియాకు వివరాలు ఇవ్వగలరా?: హైకోర్టు - secretariat buildings
సచివాలయం భవనాల కూల్చివేత కవరేజ్‌కి అనుమతివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. భవనాల కూల్చివేతలో ప్రభుత్వం గోప్యత పాటిస్తుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. సచివాలయం కూల్చివేతలో అసలు ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
కూల్చివేత వద్దకు వెళ్లడం ప్రమాదమని.. ఛానెల్, పత్రికను అనుమతిస్తే... సాధారణ ప్రజలు కూడా అడుగుతారని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలకు సమాచారం తెలపాల్సిన బాధ్యత మీడియాకు ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిషేధిత ప్రాంతాలకు మినహా ఎక్కడికైనా వెళ్లే హక్కు మీడియాకు ఉంటుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. యుద్ధ జోన్లో కూడా మీడియాను అనుమతిస్తున్నారని హైకోర్టు పేర్కొంది. కూల్చివేతలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో రోజూ మీడియా బులెటిన్ ఇచ్చినా సరిపోతుంది కదా అని అడిగింది. ప్రభుత్వాన్ని సంప్రదించి వివరణ ఇచ్చేందుకు వారం రోజులు సమయం ఇవ్వాలని ఏజీ కోరారు. రేపటిలోగా తెలపాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది.
ఇవీ చూడండి: ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై హైకోర్టులో విచారణ