సచివాలయ భవనాల కూల్చివేత పనులు సోమవారం వరకు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలు పాటించకుండా కూల్చివేత పనులు చేపట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని వ్యాఖ్యానించింది. సచివాలయం కూల్చివేతను ఆపేలా ఆదేశించాలని కోరుతూ తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
వ్యర్థ పదార్థాల నిర్వహణ చట్టానికి విరుద్ధంగా కూల్చివేతలు
జీహెచ్ఎంసీ, ఇతర ఎలాంటి అనుమతులు లేకుండా కూల్చివేతలు చేపట్టారని.. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. కూల్చివేతలు, వ్యర్థ పదార్థాల నిర్వహణ చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లో భారీ కూల్చివేతల వల్ల పరిసర ప్రాంతాల్లోని లక్షల మంది స్వచ్ఛమైన గాలి కూడా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాదించారు. హుస్సేన్‌సాగర్ బఫర్‌జోన్‌లో నిర్మాణాలు, కూల్చివేతలు కూడా చేపట్టరాదని వాదించారు.