ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకుంటున్నామని హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం నివేదించింది. సమ్మె నేపథ్యంలో ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కూడా ఆదేశించిందని పేర్కొంది.
ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకునేందుకు టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి విచారణ చేపట్టారు. ఏడాది పాటు నడిపేందుకు 1,035 ప్రైవేట్ బస్సులను చట్ట విరుద్ధంగా అద్దెకు తీసుకుంటున్నారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సూర్యకిరణ్ రెడ్డి వాదించారు. నిర్ణయం తీసుకునేందుకు ఆర్టీసీకి.. బోర్డు లేదని... అలాంటప్పుడు ఇంఛార్జి ఎండీ నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. శాశ్వత ప్రాతిపదికన ప్రైవేట్ బస్సులు అద్దెకు తీసుకోవడం వల్ల.. కార్మికుల ఉద్యోగాలు పోతాయని వాదించారు.