HC ON GOVT EMPLOYEES PETITION: షోకాజ్ నోటీసుల ఆధారంగా ఉద్యోగులపై చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీతాల విషయంలో గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఉద్యోగుల సంఘం నేత సూర్య నారాయణ హైకోర్టులో పిటిషన్‌పై దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెలువరించే వరకు ఉద్యోగులపై చర్యలొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: మేము ఎక్కడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఉద్యోగుల సంఘం నేత సూర్య నారాయణ తెలిపారు.గవర్నర్‌కు వినతిపత్రం అందించిన వ్యవహారంలో తాము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. ఆర్థిక ప్రయోజనాల విషయంలో గవర్నర్‌ను కలవడం తప్పు కాదన్న ఆయన.. ప్రభుత్వం నోటీసులు ఎలా ఇచ్చిందో తెలియట్లేదని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని మరో వారం రోజుల సమయం కావాలని కోరామని.. పొడిగింపుపై నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంకా తెలపలేదన్నారు. తాము ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. నిబంధనలకు లోబడే పని చేసినట్లు అభిప్రాయపడుతున్నామని తెలిపారు.
ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం స్పందించాలని సూర్యనారాయణ కోరారు. చెల్లింపుల విషయంలో ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించాలన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఐక్య ఉద్యమాలకు అంతా కలిసి రావాలన్నారు. ఫిబ్రవరి 2న పెండింగ్ బిల్లులు.. చట్టబద్ధతపై సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సీఎఫ్ఎంఎస్ వద్ద రూ.12 వేల కోట్ల మేర ఉద్యోగుల బకాయిలున్నాయని.. అధికారులను వివరాలు అడిగినా చెప్పట్లేదని సూర్యనారాయణ తెలిపారు.