TS High Court : రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు రోజుకు కనీసం లక్ష ఉండేలా నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రేపటి నుంచి హైకోర్టులోని అన్ని కేసులను ఆన్లైన్లోనే విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది.
TS High Court : రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలి: హైకోర్టు
12:07 January 17
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ
రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదించారు. రోజూ కనీసం లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరపాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదన్నారు. రోజూ కనీసం లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాల్సిందేనని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కరోనా నిబంధనలు అమలు కావడం లేదని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లగా... భౌతిక దూరం, మాస్కుల ధరించడంతో పాటు.. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లోని నిబంధనలన్నీ కచ్చితంగా అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
పూర్తిస్థాయి ఆన్లైన్ విచారణ
విద్యా సంస్థలకు సెలవులు ప్రభుత్వం పొడిగించిందని.. కరోనా నియంత్రణపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకుంటుందని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది. హైకోర్టులో ప్రత్యక్షంగా విచారణ చేపట్టడం వల్ల ఇబ్బందిగా ఉందని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడగా... రేపటి నుంచి పూర్తిస్థాయిలో ఆన్లైన్లోనే విచారణలు కొనసాగించాలని ధర్మాసనం నిర్ణయించింది.
ఇదీ చదవండి:Telangana Night Curfew: నైట్ కర్ఫ్యూ విధించే యోచనలో సర్కార్!