వెండితెర, బుల్లితెరల కళాకారులు, ఐటీ ఉద్యోగుల నివాస కేంద్రంగా ఉన్న మణికొండ పురపోరుకు సిద్ధమైంది. మణికొండ, నెక్నంపూర్, పుప్పాలగూడ గ్రామాలతో ఏర్పడ్డ మున్సిపాలిటీలో మొదటి సారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. 20 వార్డులు ఉన్న మణికొండలో.... 48,907 మంది ఓటర్లున్నారు.
మూడేళ్లల్లో తాగునీటి ఖర్చు అక్షరాల రూ.20కోట్లు
పెద్ద పెద్ద బిల్డింగ్లతో అభివృద్ధి చెందినట్టుగా కన్పిస్తున్న మణికొండలో మంచినీటి సమస్య తాండవిస్తోంది. 2003-04లో ప్రారంభమైన అల్కపూర్ టౌన్షిప్లో ఇప్పటికి వరకు మంచినీటి సౌకర్యమే లేదంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మంచినీటి కోసం ఒక్కొ అపార్ట్మెంట్లో నెలకు రూ.50వేల నుంచి రూ.60వేల వరకు ఖర్చు చేస్తున్నామని కాలనీవాసులు చెబుతున్నారు. గడిచిన మూడేళ్లలో రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చు చేశామంటూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా... తమ ఆవేదన వివిధ రూపాల్లో వెలిబుచ్చినా ఫలితం మాత్రం శూన్యమంటున్నారు. ఇచ్చిన హామీలను నేతలు గాలికే వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంచినీరు సౌకర్యం లేదు..ప్రత్యామ్నాయం సంగతేంటి..?
మంచినీటి సౌకర్యం ఈ కాలనీకి లేదని హెచ్ఎండీఎ అధికారులు స్పష్టం చేసినట్లు అల్కాపూర్ టౌన్షిప్ అధ్యక్షుడు ప్రమోద్ తెలిపారు. ప్రత్యామ్నాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా... ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని నిరాశ వ్యక్తం చేశారు. వచ్చే వేసవికాలం నాటికైనా సమస్యను పరిష్కరించి... ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.