హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండటం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, బేగంపేట, విద్యానగర్, తార్నాక, జీడిమెట్ల, బాలానగర్, దుండిగల్, కొంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మెహదీపట్నంలో భారీ వర్షం కురుస్తోంది.
ఎంజే మార్కెట్, బేగం బజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై నిలిచిన నీటిని తరలించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లాలో..
రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట, శంషాబాద్‌లోనూ రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. వనస్థలిపురంలోని హరిహరపురం కాలనీ, గాంధీనగర్ కాలనీల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. సాగర్ రింగ్ రోడ్డులోని రెడ్డినగర్, సాగర్ ఎన్క్లేవ్ కాలనీ, బైరామల్‌గూడలోని సౌభాగ్య నగర్, సాయి నగర్ కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా పలు లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మేడ్చల్ జిల్లాలోనూ..
మరోవైపు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోనూ రాత్రి నుంచి జోరుగా వర్షం కురుస్తోంది. మల్కాజిగిరి, నేరెడ్మెట్, కుషాయిగూడ, దమ్మాయిగూడా, జవహర్ నగర్, సుచిత్ర, కొంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, చింతల్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, గాజులరామారం, దుండిగల్ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తెలంగాణను ఆనుకొని ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని.. ఈ ద్రోణి ప్రభావంతోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఉదయం 8 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు..
- రంగారెడ్డి జిల్లా నందిగామలో అత్యధికంగా 19.4 సెంటీమీటర్లు
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 19 సెంటీమీటర్లు
- సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 18.6 సెంటీ మీటర్లు
- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో 17.9 సెంటీమీటర్లు
- వికారాబాద్ జిల్లా కల్కచర్ల మండలం పుట్టపహాడ్‌లో 15.1 సెంటిమీటర్లు
- వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం ఈనుగల్లులో 14 సెంటిమీటర్లు
- సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో 13.9 సెంటిమీటర్లు
- జనగామ జిల్లా పాలకుర్తిలో 13.1 సెంటిమీటర్లు
- మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో 12.7 సెంటీమీటర్లు
ఇదీచూడండి: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు