రాష్ట్రంలో 18-44 ఏళ్ల మధ్య వయస్కులకు ఉచిత టీకాల అందజేతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ భారీ కార్యక్రమం వచ్చే నెల 1న ప్రారంభమయ్యే అవకాశాలు తక్కువేనని వైద్యవర్గాలు చెబుతున్నాయి. బుధవారం నుంచి కొవిన్ యాప్‌లో ఈ కేటగిరీలో సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చని కేంద్రం ఇప్పటికే ప్రకటించడంతో.. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా.. అని అర్హులు ఎదురుచూస్తున్నారు. అయితే.. కొవిన్ యాప్‌లో నమోదుతో సంబంధం లేకుండానే 18-44 ఏళ్ల అర్హులందరికీ టీకాలను ఉచితంగా అందజేస్తామనీ, ఈ కేటగిరీల్లో లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో టీకాలను కొనుగోలు చేస్తోందనీ, కాబట్టి టీకాలపై కేంద్రానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. టీకాల అందజేతపై ప్రణాళిక పక్కాగా ఉన్నా.. సమస్యల్లా అసలు అంత భారీగా టీకాలు సరఫరా అవుతాయా అన్నదే! ఇప్పటికే 45 ఏళ్లు పైబడిన వారికి, వైద్య, రెవెన్యూ, పోలీసు, పురపాలక, పంచాయతీరాజ్ సిబ్బందికి టీకాల అందజేతకు అవసరమైన డోసులను కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తోంది.
ప్రణాళిక ఎలా?
* రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో టీకాలు పొందేవారు సుమారు 80 లక్షల మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే 37.58 లక్షల మందికి తొలిడోసును, 5.30 లక్షల మందికి రెండోడోసును పంపిణీ చేశారు. మిగిలిన వారికి కూడా టీకాలను కేంద్రమే దశల వారీగా సరఫరా చేస్తోంది. కాబట్టి వీటి విషయంలో ఆందోళన అక్కర్లేదు.
* ప్రస్తుతం ఈ కేటగిరీల లబ్ధిదారులకు టీకాలను అందించడానికి ప్రభుత్వ వైద్యంలో సుమారు 1200 కేంద్రాలను, ప్రైవేటులో సుమారు 250 కేంద్రాలను నెలకొల్పారు.
* వీరుకాక 18-44 ఏళ్ల మధ్యవయస్కులు రాష్ట్రంలో సుమారు 1.80 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరికి రెండు డోసులు వేయాలంటే మొత్తంగా 3.60 కోట్ల డోసుల టీకాలు కావాలి.
* వీరి కోసం కూడా అదనంగా ప్రభుత్వ వైద్యంలోనే మరో 1500 కేంద్రాలను కొత్తగా నెలకొల్పాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా ప్రభుత్వ వైద్యంలోనే ఒక్కరోజులో 2700 పంపిణీ కేంద్రాలు పనిచేయాల్సి ఉంటుంది.
* ఈ 1500 కేంద్రాల్లోనూ రోజుకు తక్కువలో తక్కువగా కనీసం 2లక్షల మందికి టీకాలిచ్చినా.. నెలకు 60 లక్షల మందికి ఇవ్వగలుగుతారు. అంటే మొదటి నెలలో (ఒకవేళ మేలో మొదలుపెడితే ఇదే నెలలో) తొలిడోసు మాత్రమే ఇస్తారు కాబట్టి.. 60 లక్షల డోసులు కావాలి.
* అలా 1.80 కోట్ల మందికి తొలిడోసు వేయడానికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. అంటే మే, జూన్, జులై నెలాఖరు వరకూ తొలిడోసు టీకాలు అందజేస్తారు.
* రెండో నెల నుంచి తొలిడోసు లబ్ధిదారులతో పాటు రెండోడోసు వారికీ టీకాలు అందించాల్సి ఉంటుంది. అప్పుడు తొలి, మలి డోసు కలుపుకొని నెలకు 1.20 కోట్ల డోసులు అవసరమవుతాయి. జూన్, జులైల్లో ఇదే విధానం కొనసాగుతుంది. అంతా సక్రమంగా జరిగితే ఆగస్టులో రెండోడోసు లబ్ధిదారులు మాత్రం మిగిలి ఉంటారు.
* జూన్, జులై నెలల్లో లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి.. తదనుగుణంగా టీకాల పంపిణీ కేంద్రాల సంఖ్యను సైతం సుమారు 3000 వరకూ పెంచాల్సి ఉంటుంది.
* ఇంత పక్కాగా ప్రణాళికబద్ధంగా టీకాల పంపిణీని నిర్వహిస్తే.. ఆగస్టు చివరి నాటికి 18 ఏళ్లు దాటిన వారందరికీ కూడా కొవిడ్ రెండు డోసుల పంపిణీ పూర్తవుతుంది.
ఎందుకు సమస్య?