Gummadi Kuthuhalamma passes away : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. తెల్లవారుజామున ఏపీలోని తిరుపతిలో గల ఆమె నివాసంలో తుది శ్వాస విడిచారు. కుతూహలమ్మ వైద్యురాలిగా పని చేశారు.
EX Minister Kuthuhalamma passes away today : ఓవైపు వైద్యురాలిగా సేవలందిస్తూ మరోవైపు తన సేవలు విస్తరించడానికి ఆమె రాజకీయాలను ఎంపిక చేసుకున్నారు. రాజకీయ అరంగేట్రం చేసిన కుతూహలమ్మ మొదటగా చిత్తూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆమె రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం కాంగ్రెస్‌లో పని చేశారు. 2014వ సంవత్సరంలో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. సుమారు ఏడాదిన్నర క్రితం టీడీపీకి కూడా రాజీనామా చేశారు.
కుతూహలమ్మ 1985 సంవత్సరంలో వేపంజేరి (ప్రస్తుతం జీడీ నెల్లూరు) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే స్థానం నుంచి 1989, 1999, 2004లోనూ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో వైద్యారోగ్యం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలు అందించారు.