ఆంధ్రప్రదేశ్లో గులాబ్ తుపాను (GULAB CYCLONE) శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు ఆరు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. తుపాను (GULAB CYCLONE) ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకుంటుండగా ఆదివారం అర్ధరాత్రి నుంచే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ పలుచోట్ల కుంభవృష్టి కురిసింది. మొత్తం 277 మండలాల్లోనూ వానలు పడ్డాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 98 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడ్డాయి. గంటకు 60 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉత్తరాంధ్రలో వేల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు, విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. నదుల్లో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. రోడ్లు, వంతెనల మీదుగా నీరు పారడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లతోపాటు విద్యుత్తు సబ్‌స్టేషన్లు, పోలీస్‌స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాసుపత్రుల్లోకి వరద నీరు చేరింది. తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. వరద ముంచెత్తడంతో విశాఖపట్నంలో వాహనాలు నీటమునిగాయి.
తుపాను ప్రభావంతో ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా గారలో అత్యధికంగా 7 సెం.మీ వర్షం కురిసింది. రాత్రి 8 గంటలకు 13.4 సెం.మీ.కి చేరింది. ఆదివారం రాత్రి 11 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో భారీవర్షాలు కురిశాయి. తర్వాత విశాఖపై గులాబ్ ప్రతాపం చూపింది. నగరంలోని తితిదే కల్యాణ మండపం ప్రాంతంలో 33.3 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. పెందుర్తి, గాజువాక, పరవాడ, పెదగంట్యాడ తదితర ప్రాంతాల్లో 24.5 సెం.మీ నుంచి 33.3 సెం.మీ మధ్య వర్షం కురిసింది.
భారీ వర్షాలకు విశాఖపట్నంలో వేల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. కొన్నిచోట్ల సోమవారం సాయంత్రానికి కూడా బయటకు పోలేదు. రహదారులపై నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. సుమారు 10 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మన్యంలో గెడ్డలు పొంగిపొర్లాయి. జిల్లాలో 147 విద్యుత్తు సబ్‌స్టేషన్లపై తుపాను ప్రభావం చూపడంతో వందల గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. రైవాడ, కోనాం మినహా మిగతా అన్ని డ్యామ్‌ల గేట్లు ఎత్తి నీరు కిందకు విడుదల చేస్తున్నారు.
- ఈదురుగాలులకు గార, శ్రీకాకుళం సహా తీర ప్రాంత మండలాల్లో భారీ సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. చాలా చెట్లు విద్యుత్తు తీగలపై పడడంతో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. సోమవారం రాత్రి వరకూ శ్రీకాకుళం నగరం, గార, వంగర, కోటబొమ్మాళి సహా పలు మండలాల్లో విద్యుత్తుసరఫరా పునరుద్ధరణ కాలేదు.
- విజయనగరం జిల్లా నెల్లిమర్ల, గజపతినగరం, పూసపాటిరేగ ప్రాంతాల్లో గరిష్ఠంగా 23.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. వందలాది వృక్షాలు నేలకూలాయి. గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. సాలూరు మండలం మామిడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పూర్తిగా నీట మునిగి మందులు, పరికరాలు అన్నీ తడిచిపోయాయి.
- పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, టి.నర్సాపురం, కామవరపుకోట, ఆచంట, పెనుమంట్ర, చింతలపూడి, పోడూరు, కొవ్వూరు, చాగల్లు, భీమడోలు, పెనుగొండ, గణపవరం తదితర ప్రాంతాల్లోనూ 12 సెం.మీ. పైగా వర్షం కురిసింది. కొండవాగులు పొంగి, పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం జల్లేరు వాగుపై కల్వర్టు కొట్టుకుపోయింది. తాడిపూడి కాలువకు గండి పడటంతో చేబ్రోలు- దూబచర్ల రహదారి నీట మునిగింది.
- తూర్పుగోదావరి జిల్లా రాయవరం, తాళ్లరేవు, కాజులూరు, కడియం, రామచంద్రాపురం, అమలాపురం, పి.గన్నవరం, కాకినాడ, రాజమహేంద్రవరం, మండపేట, అంబాజీపేట ప్రాంతాల్లో 10 సెం.మీ నుంచి 16 సెం.మీ వానలు పడ్డాయి. రంపచోడవరం- గోకవరం ప్రధాన రహదారిలో జాగరంవల్లి వద్ద భారీవృక్షం నేలకూలడంతో రాకపోకలు స్తంభించాయి. మారేడుమిల్లి మండలంలో పెళ్లిరేవు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్స్ నీటిలో నిలిచిపోయింది. స్థానికులు వాగు దాటించారు.
- కృష్ణా జిల్లా రెడ్డిగూడెం, ఉంగుటూరు, జి.కొండూరు, నందిగామ, నూజివీడు ప్రాంతాల్లో 10 సెం.మీ నుంచి 14.7 సెం.మీ మేర వర్షపాతం నమోదైంది. విజయవాడలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.