GHMC Created the Record in Property Tax Collection : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూళ్లు రాబట్టింది. గతంలో ఎన్నడూ లేనంతగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1681.52 కోట్లు వసూళ్లు సాధించింది. జీహెచ్ఎంసీ నిర్దేశించుకున్న లక్ష్యం రూ.2000 కోట్లు కాగా... రూ.1681.72 కోట్లు వసూలయ్యాయి. కలెక్షన్ శాతం 84.09 గా నమోదైంది.
కలిసి వస్తున్న రాయితీ ప్రోత్సాహం :ఏటా నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆస్తిపన్ను రాబట్టుకునేందుకు జీహెచ్ఎంసీ 5 శాతం రాయితీ ప్రకటించి ముందస్తు ఆదాయం రాబట్టుకుంటుంది. ఈ రాయితీ అవకాశాన్ని వినియోగించుకొని సుమారు 8 లక్షల పై చిలుకు మంది (దాదాపు 40 శాతం) తమ ఆస్తి పన్ను చెల్లించారు. అధికంగా ఆన్ లైన్ విధానంలో పన్ను చెల్లించారు. నగరంలో 18.52 లక్షల మంది పన్ను చెల్లించాల్సి ఉండగా.. 13 లక్షలకు పైగా మంది కట్టారు.
ఆన్ లైన్ చెల్లింపులతో వేగం.. :జీహెచ్ఎంసీకి ఈ ఆర్థిక ఏడాదిలో మొదట రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూళ్లు అయినా.. మధ్యలో కొంచెం నెమ్మదించాయి. తర్వాతి కాలంలో ఎర్లీబర్డ్ అనే ఆఫర్ పెట్టడం, ఆన్ లైన్ లో చెల్లింపులు చేసుకునే సౌకర్యం కల్పించడం, కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి వసూలు చేయడంతో వసూళ్లలో వేగం పుంజుకుంది. మొదట్లో ఎర్లీబర్డ్ ఆఫర్లో భాగంగా రూ. 741.35 కోట్ల ఆదాయం వచ్చింది.
రాత్రి 11 గంటల వరకు సేవలు : 2022-23 ఆర్థిక ఏడాది పన్ను చెల్లింపునకు నిన్న ఆఖరి రోజు కావడంతో రాత్రి 11 గంటల వరకు జంట నగరాల్లోని జీహెచ్ఎంసీ సర్కిల్, ప్రధాన కార్యాలయంలోని సిటిజన్ కార్యాలయాల్లో ప్రజలు పన్నులు చెల్లించారు.
జోన్ల వారీగా వివరాలు.. : అత్యధిక వసూళ్లు ఖైరతాబాద్ జోన్ లో, అత్యల్పంగా చార్మినార్ జోన్ లో నమోదయ్యాయి. ఖైరతాబాద్ లో లక్ష్యం రూ. 585 కోట్లు పెట్టుకోగా.. రూ. 435.57 కోట్లు వసూలయ్యాయి. చార్మినార్ జోన్ లో రూ.172 కోట్లు లక్ష్యం కాగా.. రూ. 122.86 కోట్లు వచ్చాయి. శేరింగంపల్లి జోన్ లో లక్ష్యం రూ. 393 కోట్లు కాగా.. రూ. 348.60 కోట్లు వచ్చాయి. ఎల్బీ నగర్ జోన్ లో రూ.262 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా.. రూ. 259.06 కోట్లు వసూలయ్యాయి. ఇక కూకట్ పల్లి జోన్ లక్ష్యం రూ. 295 కోట్లు కాగా రూ. 282.18 కోట్లు రాబట్టారు. సికింద్రాబాద్ జోన్ లో రూ.293 కోట్లు రావాల్సి ఉండగా.. రూ. 233.44 కోట్లు వచ్చాయి.