తెలంగాణ

telangana

ETV Bharat / state

France Researcher On Telugu: భాష గొప్పదనంతోనే దేశఖ్యాతి

France Researcher On Telugu: ఆదికవి నన్నయ్య కాలం నుంచి తెలుగు.. సాహితీ రూపంలో జీవం పోసుకుందని ఫ్రాన్స్ దేశం పరిశోధకుడు, ఆచార్యులు డేనియల్ నెజర్స్​ తెలిపారు. ఏపీలోని విజయనగర రాజుల వైభవం, లేపాక్షి చరిత్రను తెలుగు నుంచి ఫ్రెంచి భాషలోకి అనువదించడంతో పాటు చరిత్ర పరిశోధన కోసం ఆయన లేపాక్షికి వచ్చారు.

France Researcher On Telugu
ఆచార్యులు డేనియల్‌

By

Published : Jan 10, 2022, 9:10 AM IST

France Researcher On Telugu: ‘తెలుగు.. విస్తృతమైన సాహితీ భాష. 11వ శతాబ్దంలో ఆదికవి నన్నయ కాలం నుంచి సాహితీరూపంలో జీవం పోసుకుంది’ అని ఫ్రాన్స్‌ దేశానికి చెందిన పరిశోధకుడు, ఆచార్యులు డేనియల్‌ నెజర్స్‌ తెలిపారు. విజయనగర రాజుల వైభవం, లేపాక్షి చరిత్రను తెలుగు నుంచి ఫ్రెంచి భాషలోకి అనువదించడంతో పాటు చరిత్ర పరిశోధన కోసం అనంతపురం జిల్లా లేపాక్షికి వచ్చారు.

ఆచార్యులు డేనియల్‌

‘తెలుగుపై ప్రత్యేక అభిమానంతో భాష అధ్యయనానికి 1986లో ఫ్రాన్స్‌ నుంచి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు కుటుంబంతో సహా వచ్చా. భారతీయ నాగరికత, సంస్కృతి, సమాజ స్థితిగతులు, రాజకీయం, హాస్యంపై పరిశోధనలు చేశా. దీనికి ప్రధానంగా బుర్రకథలు దోహదపడ్డాయి. నా పరిశోధనను ఫ్రెంచి భాషలో రాసి ఫ్రాన్స్‌లోని విశ్వవిద్యాలయానికి సమర్పించి గౌరవ డాక్టరేట్‌ పొందా. కొన్నాళ్లు తుని పట్టణ సమీపంలోని పల్లెటూరిలో నివసించా. వేమన శతకం, చింతామణి, యానాం కథలను అధ్యయనం చేశా. వ్యావహారిక, మాండలిక భాషపై పట్టు సాధించేందుకు ప్రయత్నించా. ఇదే సమయంలో తెలుగు-ఫ్రెంచి నిఘంటువును ప్రముఖ సాహితీవేత్త ఆవుల మంజులత సహకారంతో రూపొందించా. ఇది 2005లో ప్రచురితమైంది. ప్రస్తుతం తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో మరిన్ని పదాలతో 1500 పేజీల తెలుగు-ఫ్రెంచి నిఘంటువును రూపొందించే క్రతువును కొనసాగిస్తున్నా. ఇది రెండు మూడేళ్లలోపు పూర్తవుతుంది. ఫ్రాన్స్‌లోని ప్రాచ్య భాష, నాగరికతల జాతీయ సంస్థ (ఇనాల్కా)లో 2006 నుంచి తెలుగు ఆచార్యుడిగా పనిచేస్తున్నా. ఈ సంస్థలో ప్రపంచంలోని వందకుపైగా భాషలను బోధిస్తారు. భారతదేశంలోని హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు భాషలను నేర్పుతారు. మన భాష గొప్పదనం, సంస్కృతి, చరిత్రను తెలిపే గ్రంథాలు ఇతర భాషల్లోకి అనువాదమైనప్పుడే మన విశిష్టత తెలుస్తుంది. ఈ క్రమంలోనే తెలుగుభాష చరిత్ర, సంస్కృతిని ఫ్రాన్స్‌కు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నా.

ఫ్రాన్స్‌లో తెలుగు మహాసభ నిర్వహిస్తాం..

లేపాక్షి ఆలయంలోని అద్భుత శిల్పకళా చాతుర్యం నన్నెంతో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. దీన్ని పరిరక్షిస్తూ భవిష్యత్తు తరాలకు భద్రంగా అప్పగించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. లేపాక్షి చరిత్ర, విజయనగర రాజుల వైభవాన్ని రెండేళ్లలో ఫ్రెంచి భాషలోకి అనువదిస్తా. ఇనాల్కా, యునెస్కోల ఆధ్వర్యంలో 2023లో ఫ్రాన్స్‌లో తెలుగు మహాసభ నిర్వహిస్తాం. దీంతో ఫ్రాన్స్‌, భారతదేశం మధ్య సంస్కృతి, సమైక్యత మరింత బలపడుతుంది. మేలిబాటలకు అవకాశమేర్పడుతుంది. మహాసభల ఏర్పాటు ప్రయత్నాలను ఇప్పటికే మాతృ భాషాభిమాని అయిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి చెప్పా’ అని డేనియల్‌ నేజర్స్‌ వివరించారు.

ఇదీ చదవండి:మత్తు మాయలో యువత- మాఫియా గుప్పిట్లోకి రాష్ట్రాలు!

ABOUT THE AUTHOR

...view details