Republic day celebrations in Basavatarakam Hospital: దేశంలోని వివిధ ప్రభుత్వాలు శరీరాలైతే.. రాజ్యాంగం ఆత్మ అని సినీ నటుడు, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న రాజ్యాంగం.. భారత్‌ను సర్వ సత్తాక గణతంత్ర దేశంగా తీర్చిదిద్దిందని కొనియాడారు. హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ.. ఆస్పత్రి ప్రాంగణంలోని ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
వారి కృషి ఫలితమే
ఎందరో మహానుభావుల కృషి, సేవా భావం కారణంగా మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని బాలకృష్ణ అన్నారు. దేశంలోని వివిధ ప్రభుత్వాలు శరీరాలైతే దాని ఆత్మ రాజ్యాంగమని పేర్కొన్నారు. అటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని బాలయ్య వెల్లడించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సీఈఓ డాక్టర్ ఆర్వీ ప్రభాకర్ రావు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టీఎస్ రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫణికోశ్వర రావు, మెడికల్ ఆంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ సెంథిల్ సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు.