జ్వరాల బారిన పడి రాష్ట్ర ప్రజలు విలవిల్లాడుతున్నారు. డెంగీ సహా వివిధ రకాల వైరల్ ఫీవర్స్ సోకి... ఆస్పత్రులో చేరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గత 5 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1348 డెంగీ కేసులు నమోదు కాగా... గత 4 వారాల్లో సుమారు 1.31 లక్షల మంది విష జ్వరాల భారిన పడినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇక జ్వరాల బారిన పడుతున్న వారిలో సుమారు 50 శాతం మంది చిన్నారులే కావడం గమనార్హం. మరోవైపు జ్వరం వస్తే చాలు డెంగీ అని భయపడి ప్రజలు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. వైద్యుల సలహాలేకపోయినా పరీక్షల కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం.
ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అంతే...
జ్వరాల తీవ్రత అధికంగా ఉండటం వల్ల నగరంలోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులకు ప్రతిరోజు 2 వేలకు పైగా ఓపీ కోసం వస్తున్నారు. ఇక పిల్లల అప్సత్రి నిలోఫర్లో అయితే భారీస్థాయిలో క్యూలు కడుతున్నారు. ఒక్కో పడకపై ఇద్దరు చిన్నారులను ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి. ఇక గాంధీ ఉస్మానియాల్లోనూ పడకలు చాలక... నెలపైనే పడుకోబెట్టి వైద్యులు సేవలు అందిస్తున్నారు. కేవలం ఇది ప్రభుత్వాసుపత్రుల్లోనే కాదు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. సమస్య తీవ్రతను గుర్తించిన సర్కారు ప్రభుత్వాసుపత్రుల్లో ఉదయం, సాయంత్రం, సెలవు దినాలు, ఆదివారాల్లో కూడా ఓపీ సేవలను అందిస్తున్నప్పటికీ... వైద్య పరీక్షల కిట్లు, మందులు అందించడంలో విఫలమైంది.