Famous Homeopathic Dr Sohan Singh Passed Away in Hyderabad : హోమియో వైద్యం(Homeo medicine) పేరు చెబితే.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇట్టే గుర్తుకొచ్చే పేరు డాక్టర్ సోహన్ సింగ్(Dr Sohan Singh). ఈ ప్రఖ్యాత వైద్య నిపుణుడు ఇప్పుడు ఇక లేరు. గత శుక్రవారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో హఠాత్తుగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే ఆయన మరణించినట్లు వెల్లడించారు. ఆయనకు భార్య విమల, కుమార్తె నీలిమ ఉన్నారు. చాలా ఏళ్ల క్రితమే కుమారుడు రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు. తన కుమారుడి పేరు మీదే ధర్మకిరణ్ ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు అండగా నిలిచారు.
Homeopathy Dr Sohan Singh Died of Heart Attack : ఎన్నో ప్రాంతాల్లో అతి తక్కువ ఫీజుతో వైద్య సేవలు అందించి.. తన జీతం, జీవితాన్ని వృత్తికి, హోమియోపతి వైద్యం అభివృద్ధికి అంకితం చేశారు. సోహన్‌సింగ్ అంటే ఏ ఉత్తరాది వ్యక్తోనని చాలా మంది భావిస్తారు. కానీ ఆయన అచ్చమైన తెలుగువాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని రావులపాడులో జన్మించారు. ఆయన తండ్రి వేణుగోపాలరావు స్వాతంత్య్ర సమరయోధుడు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన నేతల పేర్లనే తన కుమారులకు పెట్టుకున్నారు. అందులో భాగంగానే రెండో కుమారుడికి సోహన్‌సింగ్ బాక్నా పేరు పెట్టారు. వేణుగోపాలరావు కమ్యూనిస్టు పార్టీ తరఫున చురుగ్గా పని చేసేవారు.
ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ సి.ఆర్.రావు కన్నుమూత
King of Homeopathy Dr Sohan Singh : సోహన్‌సింగ్ బాల్యమంతా విజయవాడలోని గుడివాడలోనే గడిచింది. పీయూసీ తర్వాత హోమియోపతిలో డిప్లొమా పూర్తి చేసి.. ఉపాధి కోసం హైదరాబాద్ చేరారు. ప్రభుత్వ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా ఒక పక్క ఉద్యోగం చేస్తూనే చదువుకుని.. హోమియో వైద్యంలో అంచెలంచెలుగా ఎదిగారు. ఎప్పుడూ తన జీతంలో 25 శాతం పక్కనపెట్టి హైదరాబాద్ హోమియో కాలేజీ అభివృద్ధికి వినియోగించే వారు.
ఆయన ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు మనవరాలైన విమలను వివాహం చేసుకున్నారు. 1979లో మెదడువాపు వ్యాధితో ఎంతో మంది చనిపోయేవారు. అప్పుడు దానికి హోమియో మందులను అందించి చాలా మందిని కాపాడారు. అలాగే ఎన్నో మొండి వ్యాధులను తన వైద్యంతో నయం చేసి.. 'హోమియో కింగ్'గా నామం సార్థకం చేసుకున్నారు.