బస్తీమే సవాల్: వీధుల్లో నువ్వానేనా అంటుకుంటున్న కుటుంబసభ్యులు పురపాలక ఎన్నికల్లో సకుటుంబ సపరివార సమేత చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన వారు వేర్వేరు పార్టీల నుంచి ఒకే వార్డులో పోటీ చేస్తుంటే... మరికొందరు వేర్వేరు వార్డుల్లో ఒకే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఒకే వార్డులో వేర్వేరు పార్టీల తరఫున బరిలో నిలిచినవాళ్లు మాత్రం పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
భార్యాభర్తల సమరం...
శంషాబాద్ పురపాలక సంఘంలో 11వ వార్డు నుంచి గొరిగె నందరాజ్‌గౌడ్ పోటీ చేస్తే... 21వ వార్డు నుంచి అతని భార్య గొరిగె అన్నపూర్ణ బరిలో నిలిచింది. ఇద్దరూ కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తున్నారు. షాద్‌నగర్ పురపాలక సంఘంలో తెరాస తరఫున 28వ వార్డు నుంచి కొందుటి నరేందర్, 20వ వార్డు నుంచి అతడి భార్య కొందుటి మహేశ్వరి పోటీ చేస్తున్నారు.
వీధుల్లో తోడి కోడళ్ల పోరు...
బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థలోని 9వ డివిజన్లో తోడికోడళ్లు పోటీకి దిగారు. తెరాస తరపున అన్నపురెడ్డి రజిత పోటీ చేస్తే... భాజపా తరపున ఆమె తోడికోడలు అన్నపురెడ్డి అంబిక బరిలో నిలిచారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థలో 16వ డివిజన్ నుంచి తెరాస తరపున బండి రమ్య బరిలో ఉండగా... 19వ డివిజన్ నుంచి ఆమె తోడి కోడలు బండి లత పోటీ చేస్తోంది.
ఒకే కుటుంబం నుంచి ముగ్గురు...
కొంపల్లి పురపాలక సంఘంలో తెరాస తరపున శ్రీశైలం యాదవ్ 3వ వార్డులో పోటిచేస్తుండగా... 2వ వార్డు నుంచి అతని భార్య కవితను బరిలో నిలిపారు. 13వ వార్డు నుంచి అతడి తమ్ముడు శ్రీశైలం యాదవ్ పోటిచేస్తున్నారు. 1వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిరెడ్డి రేణుకారెడ్డి నిలబడితే... ఆమె మరుదులు భాజపా తరఫున రాజిరెడ్డి 9వ వార్డు నుంచి, మోహన్‌రెడ్డి 3వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు.
విజయం ఎవరికి దక్కినా... తమ కుటుంబానికే పదవి అని కొంతమంది భావిస్తుంటే... రాజకీయాలు రాజకీయాలే... కుటుంబం కుటుంబమే అంటున్నారు మరికొందరు. ఎన్నికల్లో ఎంత ప్రచారం చేసినా... అవి పూర్తయ్యక బంధాలు మాత్రం ఎప్పటిలాగే కొనసాగిస్తామంటున్నారు. ప్రచారంలో మాత్రం తగ్గేది లేదంటూ... పోటాపోటీగా శ్రమిస్తున్నారు.
బస్తీమే సవాల్: కాలం మారింది..సెల్‌ఫోన్‌తో ఇస్మార్ట్ ప్రచారం..