ఒస్లాం ఐటీ సంస్థ...
ఒస్లాం ఐటీ సంస్థ... ఇందులో పనిచేసే వారంతా ఇంటర్మీడియట్, ఆపై చదివిన యువతులే. టెలీకాలర్స్‌గా ఉద్యోగాలు ఇచ్చారు. వారం రోజులు శిక్షణ. చేయాల్సింది యువకులకు ఫోన్ చేసి పర్పల్ ఫ్యాంటసీ, హాట్ టెంప్టేషన్స్, హనీ పికప్, ఫ్యాషన్ డిజైర్, రియల్ హంటర్స్, కిన్కీ డిజైర్ వంటి వెబ్ పేజీల్లో చేర్పించాలి. ఈ టెలీకాలర్స్ వలపు వల విసిరి కుర్రాళ్లను ఆకర్షించాలి.
అబ్బాయిలకు వలవేయటమే వీరి పని..
ఈ వెబ్సైట్లలోకి వచ్చిన అబ్బాయిలతో మాట్లాడి... సభ్యత్వం రుసం వెయ్యి రూపాయలు కట్టించాలి. వెబ్‌సైట్‌లో నచ్చిన అమ్మాయి ఫొటో చూడాలంటే రూ. 10 వేలు చెల్లించాలి. చెల్లిస్తే వాట్సాప్‌లో యువతి ఫొటోలు పంపిస్తారు. వారితో మాట్లాడాలంటే కార్డులు ఇస్తారు. ఒక్కో రకమైన కార్డుకు ఒక్కో ధర ఉంటుంది. సిల్వర్ కార్డ్ కొంటే ఎంపిక చేసుకున్న అమ్మాయితో బయట తిరగొచ్చు. సినిమాలకూ, పార్కులకూ వెళ్లొచ్చు. గోల్డ్ కార్డు పొందితే ఇంకాస్త ముందుకెళ్లొచ్చు. ఈ కార్డుల కోసం రూ.28 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు.
ఒక్కొక్కరికీ నెలకు లక్షల్లో జీతం...
నెలకు నలుగురు లేక ఐదుగురు యువకులను ముగ్గులోకి దింపి సభ్యత్వాలు చేయిస్తే టెలీకాలర్స్ అదనపు డబ్బులు ఇస్తారు. అక్కడ ఇలా నెలకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు జీతం సంపాదిస్తున్నారు. వీరికో బంపర్ ఆఫర్ ఉంది. కుర్రాళ్లను ముగ్గులోకి దించి నెలకు 30 లక్షలకుపైగా వసూలు చేస్తే బహుమతిగా కారు ఇస్తారు.
మోసానికి మరో మోసం తోడు...
బాధితులు 5 లక్షల రూపాయల వరకు చెల్లించిన తర్వాత అంతే సంగతులు. అమ్మాయి కనిపించదు. చేసేది లేక డబ్బులు గురించి గట్టిగా ప్రశ్నిస్తే మీ ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్తారు. ఇందుకు బ్యాంకు ఖాతా వివరాలివ్వాలని అడుగుతారు. ఆ డబ్బు ఇవ్వాలంటే మరో 5 లక్షలు జమ చేయాలని ..కేవలం 10 వేలు మినహాయించుకుని మిగిలిన రూ.9.90 లక్షలు ఇస్తామని కట్టుకథలు చెబుతారు. ఆ డబ్బులు వేశాక ఎలాంటి ఫోనూ ఉండదు. ఆ నెంబరూ పని చేయదు.
విశాఖ సాప్ట్ వేర్ కు 18 లక్షలు టోకరా...
ఆరు నెలల క్రితం విశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి 18 లక్షలు నష్టపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుట్టు తెలుసుకోవడానికి సైబర్ పోలీసులకు 2 నెలలు పట్టింది.
నిందితులను పట్టుకున్న విశాఖ సైబర్ క్రైం పోలీసులు...
బాధితుడి ఫిర్యాదు అందుకున్న విశాఖ పోలీసులు... సైబర్ క్రైం సీఐ గోపినాథ్ నేతృత్వంలో దాడులు జరిపి 23 మంది టెలీకాలర్స్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి బేసిక్ ఫోన్లు, 15 స్మార్ట్ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, కార్యాలయ దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కోర్టుకు తరలించి... ట్రాన్సిట్ వారెంట్ కింద విశాఖ తీసుకురానున్నారు. వీరి వలలో విశాఖ వ్యాపారులు, ఉన్నతవర్గాలకు చెందిన వ్యక్తులు, నేవీ అధికారులు పడినట్టు సమాచారం. ఇదంతా రూపమ్ అనే వ్యక్తి నడిపించాడని పోలీసులు గుర్తించారు. ఇతనికి కోల్‌కతాలోనే నాలుగైదు కార్యాలయాలున్నట్లు తెలిపారు. ఒక కార్యాలయంపై ఎవరికైనా అనుమావం వస్తే అక్కడి ఉద్యోగులను మరో కార్యాలయానికి తరలించేవారు. ఫిర్యాదు అందిన మేరకు కొన్ని డేటింగ్ వెబ్ పేజీలు బ్లాక్ చేశారు పోలీసులు. మోసపోయిన వారు ఉంటే ఫిర్యాదు చేయటానికి ముందుకు రావాలని సూచించారు.
ఆమె ఫొటో చూడాలంటే రూ.10వేలు... షికార్లకు రూ.లక్ష ఇదీ చూడండి: ఆన్లైన్లో మొబైల్ బదులు రాళ్లు- భాజపా ఎంపీ షాక్