లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో గుడుంబా తయారీకి అడ్డుకట్ట వేసేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. బుధవారం ఆబ్కారీ శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో గుడుంబా నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.
అదిలాబాద్, వరంగల్ గ్రామీణం, మహబూబ్‌బాద్, భూపాలపల్లి, కొల్లాపూర్, అచ్చంపేట, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో గుడుంబా తయారీ అధికంగా ఉన్నట్లు మంత్రి దృష్టికి రావడం వల్ల తీవ్రంగా స్పందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా గుడుంబా తయారీ, సరఫరా, విక్రయాలపై 1922 కేసులు నమోదు, 8091 లీటర్లు గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో అక్రమ మద్యం విక్రయదారులపై 743 కేసులు నమోదు చేసి 777 మందిని అరెస్టు చేసినట్లు మంత్రి తెలిపారు. 6,223 లీటర్ల లిక్కర్, 4525 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేసిన 21 మందిపై కేసులు నమోదు, 212 లీటర్లు లిక్కర్, 22 లీటర్లు బీరు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. లాక్‌డౌన్ సందర్భంగా 45 మంది లైసెన్సీలు నియమావళికి వ్యతిరేకంగా మద్యం అమ్మకాలు చేసినట్లు గుర్తించి కేసులు నమోదు చేసి 80 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:గూగుల్ మీట్‌ను ఇకపై ఉచితంగా వాడొచ్చు