Effect Of Sun On Crops: అధిక వేడి, పొడి వాతావరణం పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పూత, కాత, దిగుబడి తగ్గుతున్నాయి. తెలంగాణ వాతావరణం, భూముల్లో సాగుచేసే పంటలు 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే తట్టుకోలేవని.. ప్రస్తుతం సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతుండటంతో 10 నుంచి 15 శాతం దిగుబడి తగ్గే అవకాశం ఉందని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు(డైరెక్టర్) డాక్టర్ జగదీశ్వర్ పేర్కొన్నారు. వరితో పాటు కూరగాయలు, ఇతర పంటల్లో రసం పీల్చే పురుగులు, ఆకుమచ్చ తెగుళ్ల దాడి ఉద్ధృతంగా ఉన్నట్లు తమ పరిశోధనల్లో గుర్తించినట్లు ఆయన తెలిపారు. వంగ తోటల్లో కొమ్మ, కాయతొలుచు, మిరపలో తామర పురుగు, మామిడిలో తేనేమంచు పురుగు, పిండినల్లి, పొలుసు పురుగు, పండు ఈగలు అధికంగా ఉన్నాయన్నారు. ఎండల ధాటికి కూరగాయల దిగుబడి పడిపోవడంతో ధరలూ మండుతున్నాయి. పక్షం రోజుల క్రితం టమాటా ధర రూ.10లోపు ఉండగా ఇప్పుడు రూ.50కి చేరింది.
* అధిక ఎండలకు కోళ్లఫారాలు, పాడి పశువుల నిర్వహణ రైతులకు భారంగా మారింది. కోళ్లకు కొక్కెర తెగులు సోకే అవకాశం ఉందని, దీని నివారణకు వాటికి టీకాలు వేయించాలని జయశంకర్ వర్సిటీ సూచించింది. కోళ్ల ఫారాల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, రేకుల షెడ్లపై వరిగడ్డి కప్పి నీటి తుంపర్లు పడేలా తుంపర యంత్రాలు ఏర్పాటు చేయాలంది. వాటికి చల్లని తాగునీటిని ఏర్పాటు చేయాలని తెలిపింది. అధిక ఎండలను తట్టుకోలేక కోళ్లు చనిపోతున్నాయని తెలంగాణ రాష్ట్ర కోళ్లఫారాల సమాఖ్య అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెలిపారు.
* అధిక ఎండలకు పాల ఉత్పత్తి తగ్గుతుందని పశువులను సాధారణ ఉష్ణోగ్రతల్లో ఉంచి కాపాడుకోవాలని పశువైద్యశాఖ హెచ్చరించింది. పాడి ఆవులు, గేదెల్లో గొంతువాపు, గాలికుంటు వ్యాధులు సోకే అవకాశముందని.. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.