పాఠశాలల్లో తరగతులను విడతల వారీగా ప్రారంభించాలని విద్యాశాఖ యోచిస్తోంది. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ (ప్రత్యక్ష తరగతులు) అవకాశం కల్పిస్తారు. ఏ విధానంలో హాజరు కావాలన్నది విద్యార్థుల ఇష్టం. జులై 1వ తేదీ నుంచి 8, 9, 10 తరగతులను, 20వ తేదీ నుంచి 6, 7 తరగతులను మొదలుపెట్టాలని, ఆగస్టు 16వ తేదీ నుంచి 3, 4, 5 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించాలని భావిస్తోంది. రాష్ట్రంలో విద్యాసంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విధివిధానాలను ఖరారు చేసేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం పాఠశాల, ఇంటర్, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ అధికారులతో చర్చించారు. ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో అన్ని సంవత్సరాల తరగతులు జులై 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని కళాశాల విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు.
6వ తరగతి ప్రవేశాలు పూర్తయితేనే..
పాఠశాలల్లో 3-10 తరగతులను రెండు లేదా మూడు విడతల్లో ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం ఆరో తరగతిలో ప్రవేశాలు జరగలేదు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ప్రాథమిక పాఠశాలల్లో అయిదో తరగతి పూర్తి చేసి ప్రాథమికోన్నత (యూపీఎస్) లేదా ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశిస్తారు. ఇప్పటివరకు బడులు ప్రారంభం కాకపోవడంతో ప్రవేశాలు పూర్తి కాలేదు. దానికితోడు పాఠశాలలను ప్రారంభించేందుకు అవసరమైన సన్నద్ధతకు కొద్ది రోజులు మాత్రమే గడువు ఉండటంతో తొలి విడతలో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రారంభించాలని విద్యాశాఖ ప్రతిపాదిస్తోంది. ముఖ్యమంత్రి ఆమోదం మేరకు విధివిధానాలు జారీచేయనున్నారు.
ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులు పెంచొద్దు: మంత్రి