తెలంగాణ

telangana

ETV Bharat / state

Ed Attach Nama Properties: ఈడీ కొరడా.. మధుకాన్‌ గ్రూప్‌ ఆస్తులు అటాచ్‌

Ed Attach Nama Properties: తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ గ్రూపు ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. మధుకాన్ కంపెనీలతో పాటు నామ నాగేశ్వరరావు ఇతర డైరెక్టర్ల పేరిట ఉన్న చెందిన 96 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడా తాత్కాలిక జప్తు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పేరిట బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఇతర వ్యాపారాలకు మళ్లించినట్లు ఈడీ అభియోగం నమోదు చేసింది. నామ నాగేశ్వరరావు అధీనంలోని ఆరు డొల్ల కంపెనీల ద్వారా కూడా నిధులు మళ్లించినట్లు ఈడీ వెల్లడించింది.

Ed Attach Nama Properties
తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు

By

Published : Jul 2, 2022, 8:17 PM IST

Ed Attach Nama Properties: ఒకవైపు భాజపా, తెరాస మధ్య రాజకీయ వేడి కొనసాగుతుండగానే... మరోవైపు తెరాస లోక్​సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కంపెనీ ఆస్తులపై ఈడీ కొరడా ఝుళిపించింది. మధుకాన్ గ్రూపు సంస్థలు, వాటి డైరెక్టర్లకు చెందిన 96 కోట్ల 21 లక్షల రూపాయల విలువైన స్థిర, చరాస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాత్కాలిక జప్తు చేసింది. గతేడాది నామ నాగేశ్వరావు ఇంట్లో సోదాలు జరిపి 34 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. నామ నాగేశ్వరరావుతో పాటు పలువురిని ప్రశ్నించి వాంగ్మూలాలను నమోదు చేసింది. నామ నాగేశ్వరరావు బంధువు శ్రీనివాసరావును గతంలో ఈడీ అరెస్టు చేసింది.

మధుకాన్ గ్రూపునకు చెందిన రాంచీ ఎక్స్​ప్రెస్ వేస్ లిమిటెడ్​పై గతంలో సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. రాంచీ నుంచి జంషెడ్​పూర్ వరకు నాలుగు వరసల రహదారి నిర్మాణ కాంట్రాక్టు 2011లో మధుకాన్​కు దక్కింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం కమ్మ శ్రీనివాసరావు, నామ సీతయ్య, నామ పృథ్వీ డైరెక్టర్లుగా రాంచీ ఎక్స్​ప్రెస్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్​ను ఏర్పాటు చేశారు. రహదారి నిర్మాణం కోసం వివిధ బ్యాంకుల నుంచి రాంచీ ఎక్స్​ప్రెస్ వేస్ పేరిట 1080 కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు ఈడీ వెల్లడించింది.

అయితే ఆ సొమ్మును రహదారి నిర్మాణం కోసం కాకుండా ఇతర వ్యాపారులు, చెల్లింపుల కోసం మళ్లించినట్లు ఈడీ అభియోగం. బోగస్ కాంట్రాక్టులు, బిల్లులు సృష్టించడంతో పాటు ఆరు డొల్ల కంపెనీల ద్వారా నగదు లావాదేవీలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. ఉషా ప్రాజెక్ట్స్, శ్రీ బీఆర్ విజన్స్, శ్రీ ధర్మ సాస్త కనస్ట్రక్షన్స్, శ్రీ నాగేంద్ర కనస్ట్రక్షన్స్, రాగిణి ఇన్​ఫ్రాస్ట్రక్చర్, వరలక్ష్మీ కన్​స్ట్రక్షన్స్ అనే ఆరు డొల్ల కంపెనీలు నామ నాగేశ్వరరావు, నామ సీతయ్య అధీనంలోనే ఉన్నాయని ఈడీ పేర్కొంది. హైదరాబాద్, పశ్చిమ బెంగాల్, విశాఖపట్నం, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 88 కోట్ల 85 లక్షల రూపాయల విలువైన భూములు, మధుకాన్ షేర్లు సహా 7 కోట్ల 36 లక్షల రూపాయల విలువైన చరాస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎన్ ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details